రూ.4,215 కోట్ల ఆర్థిక మోసం..ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అరెస్టు
రూ.4,215 కోట్ల భారీ ఆర్థిక మోసంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ఆర్యన్ సింగ్‌ను తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) అరెస్టు చేసింది.
By Knakam Karthik
రూ.4,215 కోట్ల ఆర్థిక మోసం..ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అరెస్టు
భారతదేశం అంతటా వేలాది మంది పెట్టుబడిదారులను మోసగించిన రూ.4,215 కోట్ల భారీ ఆర్థిక మోసంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ఆర్యన్ సింగ్‌ను తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) అరెస్టు చేసింది. ఫాల్కన్ గ్రూప్ అసలు పేరు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఇన్వెస్ట్మెంట్ స్కీం పేరిట దేశవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించింది. తక్కువ సమయంలో అధిక లాభాలు ఇస్తామని చెప్పి వేలకోట్లు వసూలు చేశారు. ఈ సంస్థ మోసం వెలుగులోకి రావడంతో ఫాల్కన్ గ్రూప్ చైర్మన్ అమర్దీప్ ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసి దుబాయ్ పారిపోయినట్లు సమాచారం.
ఆపరేషనల్ హెడ్ సందీప్ కుమార్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.2.5 కోట్ల విలువైన కార్లు, 14 స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతర నిందితులు పవన్, కావ్య, రవికుమార్ తదితరులు పరారీలో ఉన్నారు. పోలీసుల వివరాల మేరకు ఫాల్కన్ సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ.. ఎంఎన్సీ కంపెనీలలో పెట్టుబడుల పేరుతో డిపాజిట్లు స్వీకరించారు. మొత్తం 7,000 మందికి పైగా బాధితులు ఉ న్నట్లు గుర్తించారు. వసూలు చేసిన డబ్బును 14 కంపెనీల్లో పెట్టుబడులుగా మార్చారు. కొంతమందికి రూ.850 కోట్లు తిరిగి చెల్లించినా, ఇంకా అంతే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. కేనును తెలంగాణ సీఐడీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్నాయి.
ఈ కేసులో ఐదవ నిందితుడు అయిన ఆర్యన్ సింగ్ పై కేసు నమోదైన తరువాత నాందేడ్ మీదుగా పంజాబ్‌లోని బతిండా జిల్లా వరకు పారిపోయి అక్కడ ఒక గురుద్వారాలో తలదాచుకున్నాడు. విశ్వసనీయ సమాచారంతో CID బృందం అక్కడికి వెళ్లి జూలై 4న అరెస్ట్ చేసింది. ఆయనను హైదరాబాద్‌కు తీసుకువచ్చి, జూలై 6న న్యాయమూర్తి ముందు హాజరు పరిచి న్యాయ రిమాండ్ కోరింది. కంపెనీ coo గా వ్యవహరించిన ఆర్యన్, స్ట్రాటజిక్ డిపాజిట్ల పేరిట రూ.14.35 కోట్లు, తన ఖాతాలోకి రూ.1.62 కోట్లు మళ్లించుకున్నాడని పోలీసులు తెలిపారు. అతనే బాధితులతో డీలింగ్ చేసేవాడు. ఫేక్ ఒప్పందాలు, డాక్యుమెంట్లు ఇచ్చేవాడు. ఆర్యన్ వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఇంక్రిమినేటింగ్ డాక్యుమెంట్లు CID అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బాధితుల ఫిర్యాదుల ఆధారంగా, సైబరాబాద్‌లోని ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్‌లు 316(2), 318(4), 61(2) మరియు TSPDEF చట్టం, 1999లోని సెక్షన్ 5 కింద మొదట మూడు కేసులు నమోదు చేయబడ్డాయి మరియు తరువాత సమగ్ర దర్యాప్తు కోసం CIDకి బదిలీ చేయబడ్డాయి. వివిధ రాష్ట్రాల్లో కంపెనీ మరియు దాని డైరెక్టర్లపై మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి.