నకిలీ డాక్టర్.. తప్పుడు ఇంజెక్షన్ వేయడంతో వ్యక్తి మృతి
ఓ నకిలీ డాక్టర్ గుట్టు రట్టైంది. ఒక వ్యక్తికి తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినందుకు క్లినిక్ యజమానిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 12 Sep 2023 2:15 AM GMTనకిలీ డాక్టర్.. తప్పుడు ఇంజెక్షన్ వేయడంతో వ్యక్తి మృతి
రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో ఓ నకిలీ డాక్టర్ గుట్టు రట్టైంది. ఒక వ్యక్తికి ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినందుకు క్లినిక్ యజమానిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. నిందితుడు.. జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (GNM) డిప్లొమా హోల్డర్, డాక్టర్ కాదు. గత సోమవారం బాధితుడు దగ్గు, జ్వరం కోసం క్లినిక్‌ని సంప్రదించిన తర్వాత బాధితుడికి మోనోసెఫ్ 500 ఎంజీ ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో అతడు మృతి చెందాడు. అనంతరం మృతుడి మృతదేహాన్ని ఇందర్‌గఢ్ పట్టణంలోని రోడ్డుపై పడేశాడు. బుండి జిల్లాలోని ఇందర్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్‌పురా గ్రామానికి చెందిన ఓం ప్రకేష్ గుర్జార్ అనే 38 ఏళ్ల వ్యక్తి గత మంగళవారం ఇందర్‌గఢ్ పట్టణంలోని సుమెర్‌గంజ్ మండి రోడ్డులో శవమై కనిపించాడు.
మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి గుర్తు తెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓం ప్రకేష్ సోమవారం దగ్గు, జ్వరం కోసం ఓ ప్రైవేట్ క్లినిక్‌ని సందర్శించాడు. క్లినిక్ యజమాని - హరియోమ్ సైనీ (35)గా గుర్తించబడిన GNM డిగ్రీ హోల్డర్.. అతనికి మోనోసెఫ్ 500 ఇంజెక్ట్ చేశాడని ఇందర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామేశ్వర్ చౌదరి చెప్పారు. ఇంజక్షన్ వేసిన వెంటనే పల్స్, బ్లడ్ ప్రెజర్ తగ్గిపోవడంతో ఓం ప్రకేష్ పరిస్థితి క్షీణించిందని, అదే రోజు స్పృహ తప్పి పడిపోయి మృతి చెందినట్లు సీఐ తెలిపారు. అదే రోజు రాత్రి నిందితుడు దీపక్ అనే సహాయకుడి సహాయంతో మృతదేహాన్ని తన కారులో తీసుకెళ్లాడు.
సైనీ.. ఓం ప్రకేష్ మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి, మొబైల్‌ని అతని చేతిలో పెట్టి ఇంటికి తిరిగి వచ్చారని అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలోని CCTV ఫుటేజీ, ఇతర సాంకేతిక విశ్లేషణల ఆధారంగా పోలీసులు సైనీని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడని సీఐ తెలిపారు. నిందితుడిపై ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్, సెక్షన్ 420, సెక్షన్ 411 మరియు ఐపిసి సెక్షన్ 302 కింద అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు. ఓం ప్రకేష్ మృతదేహం లభ్యమైన ఐదు రోజుల తర్వాత ఆదివారం సాయంత్రం నిందితుడిని అరెస్టు చేశామని, సోమవారం కోర్టు ముందు హాజరుపరచగా, అతన్ని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించినట్లు వారు తెలిపారు. నిందితుడి క్లినిక్‌ని కూడా సోమవారం వైద్య శాఖ బృందం సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.