రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లా కళింజరా పట్టణంలో మంగళవారం ఉదయం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయినిని మాజీ ప్రేమికుడు కత్తితో నరికి చంపిన బాధాకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో బస్టాండ్‌లో ఉపాధ్యాయురాలు బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఈ ఘటన జరిగింది.
సజ్జన్‌గఢ్ బ్లాక్‌లోని ఛాయా మహూరిలో ఉన్న ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్‌లో సంస్కృత సబ్జెక్టు రెండో తరగతి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అర్థునాకు చెందిన లీలా తబియార్(36)ను మృతురాలిగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లీలా మాజీ ప్రియుడు నిందితుడు మహిపాల్ భగౌరా ఆల్టో కారులో అక్కడికి చేరుకుని ఎలాంటి వాదన చేయకుండానే నేరుగా లీలా కడుపులో కత్తితో పొడిచాడు.
దాడి జరిగిన వెంటనే నిందితుడు కారులో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.. అయితే ఆ భయంలో అతని కారు బస్టాండ్ సమీపంలో చెట్టును ఢీకొట్టింది. దీంతో కారును అక్కడే వదిలేసి పారిపోయాడు నిందితుడు. బాటసారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కళింజర పోలీస్ స్టేషన్ మరియు బాగిదౌరా DSP సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మహిళను అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు.
ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న కారు నంబర్ ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు బన్స్వార ఎస్పీ హర్షవర్ధన్ అగర్వాల్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మొత్తం వీడియో సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. పోలీసులు కారును సీజ్ చేసి నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.