దారుణం.. ఇద్దరు యువకులను నరికి చంపిన అక్రమ మద్యం వ్యాపారులు
తమిళనాడులోని మైలదుత్తురై జిల్లాలోని ముత్తం గ్రామంలో అక్రమ మద్యం వ్యాపారులు ఇద్దరు యువకులను దారుణంగా నరికి చంపారు.
By అంజి Published on 15 Feb 2025 5:00 PM IST
దారుణం.. ఇద్దరు యువకులను నరికి చంపిన అక్రమ మద్యం వ్యాపారులు
తమిళనాడులోని మైలదుత్తురై జిల్లాలోని ముత్తం గ్రామంలో అక్రమ మద్యం వ్యాపారులు ఇద్దరు యువకులను దారుణంగా నరికి చంపారు. బాధితులను పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్ హరీష్, అతని బంధువు ఇంజనీరింగ్ విద్యార్థి హరిశక్తిగా గుర్తించారు. ఫిబ్రవరి 15 శనివారం ఈ దాడి జరిగింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ముగ్గురు అక్రమ మద్యం వ్యాపారులు - రాజ్ కుమార్, తంగదురై, మూవేందన్ - ముత్తం నార్త్ స్ట్రీట్ లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు.
వారు తమ కార్యకలాపాలను ప్రశ్నించిన వారిని బెదిరించడం, దాడి చేస్తుండే వారు. గతంలో, మైలదుత్తురై పోలీసులు ఆ ప్రాంతంలో దాడి చేసి రాజ్ కుమార్ ను అరెస్టు చేశారు. అయితే, గత గురువారం బెయిల్ పై విడుదలైన తర్వాత అతను తన అక్రమ మద్యం వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాడు. ఒక మైనర్ బాలుడు అక్రమ మద్యం వ్యాపారుల అక్రమ వ్యాపారం గురించి వారిని ఎదుర్కొన్నప్పుడు హింస పెరిగింది. కోపంతో ముగ్గురు వ్యక్తులు ఆ బాలుడిని శారీరకంగా దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటనను చూసిన హరీష్, హరిశక్తి జోక్యం చేసుకుని వ్యాపారులను ఎదుర్కొన్నారు.
ప్రతిగా, అక్రమ మద్యం వ్యాపారులు వారిపై కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పెరంబూరు పోలీసులు సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం పరీక్షల కోసం మైలదుత్తురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మైలదుత్తురై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ స్టాలిన్ నేరస్థలాన్ని సందర్శించి బాధితుల కుటుంబాలను పరామర్శించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత మధ్య, ప్రభుత్వ ఆసుపత్రిలో శాంతిభద్రతలను కాపాడటానికి అదనపు పోలీసు సిబ్బందిని మోహరించారు.