ఏపీలో దారుణం.. బంగారం కోసం వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పరిధిలోని ఓ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By అంజి Published on 25 March 2024 6:48 AM ISTఏపీలో దారుణం.. బంగారం కోసం వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పరిధిలోని ఓ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంచిగా నటించి నమ్మకద్రోహం చేశారు. బంగారు ఆభరణాల వివాదంలో 84 ఏళ్ల వృద్ధురాలిని ఆమె పొరుగువారు హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి యర్రగుంట్ల గ్రామ సమీపంలోని పెనకచెర్ల ఆనకట్టలో పడేశారు. ఈ ఘటనకు సంబంధించి అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఓబులమ్మ యర్రగుంట్లలోని తన ఇంట్లో ఒంటరిగా ఉంటుందని, కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఉంటారని తెలిపారు. ఆమె మోతుబరి రైతు కుటుంబానికి చెందినది. చుట్టు పక్కల వారితో ఆప్యాయంగా ఉండేది. ఊరిలో జరిగే శుభకార్యాలకు, కష్టాల్లో ఉన్న వారికి బంగారం ఇచ్చి ఆదుకునేది.
ఈ క్రమంలోనే దాదాపు 15 రోజుల క్రితం ఓబులమ్మ తన ఏడు తులాల బంగారు నగలను పక్కింటి వ్యక్తి కృష్ణమూర్తికి అప్పుగా ఇచ్చింది. నిందితుడు తన ఇంట్లో ఓ ఫంక్షన్ ఉన్నందున నగలను అప్పుగా తీసుకున్నాడు. కృష్ణమూర్తి నగలు తిరిగి ఇవ్వకపోవడంతో ఓబులమ్మ గ్రామ పెద్దలను ఆశ్రయించింది. బంగారం తిరిగి ఇవ్వాలని పెద్దలు సూచించారు. ఈ క్రమంలోనే కృష్ణమూర్తికి దుర్భుద్ది పుట్టింది. వృద్ధురాలిని హతమారిస్తే బంగారం మిగిలిపోతుందని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వృద్ధురాలిని నిందిత కుటుంబం హత్య చేసింది. నిందితుడితో పాటు అతని కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.