వృద్ధ దంపతులకు సైబర్ నేరగాళ్ల వల..రూ.14.85 కోట్లు టోకరా

ఢిల్లీలో 'డిజిటల్ అరెస్ట్' స్కామ్ లో వృద్ధ ఎన్నారై దంపతులు రూ.14.85 కోట్లు మోసపోయారు.

By -  Knakam Karthik
Published on : 12 Jan 2026 11:10 AM IST

Crime News, Delhi, Cyber Fraud, digital arrest scam

వృద్ధ దంపతులకు సైబర్ నేరగాళ్ల వల..రూ.14.85 కోట్లు టోకరా

ఢిల్లీలో 'డిజిటల్ అరెస్ట్' స్కామ్ లో వృద్ధ ఎన్నారై దంపతులు రూ.14.85 కోట్లు మోసపోయారు. 17 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరింపులకు గురైన ఈ దంపతులు, జీవితకాలం పొదుపు చేసుకున్న సుమారు రూ.15 కోట్లను కోల్పోయారు. ఈ సంచలన ఘటన తాజాగా దిల్లీలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డా. ఓం తనేజా, ఆయన భార్య డా. ఇందిరా తనేజా దాదాపు 48 సంవత్సరాల పాటు ఐక్యరాజ్యసమితిలో(యూఎన్) సేవలందించారు. పదవీ విరమణ అనంతరం 2015లో భారత్‌కు తిరిగివచ్చారు. గత డిసెంబర్ 24న పోలీసు అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు ఆ దంపతులకు ఫోన్ చేశారు. తమపై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయని చెబుతూ వారిని భయభ్రాంతులకు గురి చేశారు.

డిసెంబర్ 24 నుంచి sజనవరి 10 వరకు డిజిటల్ అరెస్టు చేస్తున్నామని వీడియో కాల్ ద్వారా హెచ్చరించారు. ఈ కాలంలో బెదిరింపులు, మానసిక ఒత్తిడితో ఆ దంపతుల నుంచి సైబర్ మాయగాళ్లు రూ.14.85 కోట్లను కాజేశారు. ఆ తర్వాత సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదిస్తే ఆర్‌బీఐ ఆదేశాల మేరకు డబ్బులు తిరిగి వస్తాయని స్కామర్లు వారికి చెప్పి తప్పుదారి పట్టించారు. దీంతో వృద్ధ దంపతులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అసలు విషయం బయటపడింది. తమపై ఎలాంటి అరెస్ట్ వారెంట్లు లేవని, తాము సైబర్ మోసానికి గురయ్యామని వారు తెలుసుకున్నారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story