సిగ్న‌ల్ వ‌ద్ద వాహ‌నాల‌పైకి దూసుకువెళ్లిన ఆర్టీసీ బ‌స్సు

Driver Has Heart Attack Bus Rams Several Vehicles.మృత్యువు ఏ రూపంలో ఎలా వ‌స్తుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేరు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Dec 2022 9:24 AM IST
సిగ్న‌ల్ వ‌ద్ద వాహ‌నాల‌పైకి దూసుకువెళ్లిన ఆర్టీసీ బ‌స్సు

మృత్యువు ఏ రూపంలో ఎలా వ‌స్తుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. ట్రాఫిక్ సిగ్న‌ల్ ప‌డ‌డంతో వారు త‌మ వాహ‌నాలు నిలిపివేశారు. గ్రీన్ సిగ్న‌ల్ కోసం వేచి చూస్తున్నారు. అదే స‌మ‌యంలో సిగ్న‌ల్ వ‌ద్ద‌కు ఓ బ‌స్సు వ‌స్తోంది. అయితే.. ఆ బ‌స్సు డ్రైవ‌ర్‌కు స‌డెన్‌గా గుండెపోటు రావ‌డంతో స్టీరింగ్‌పైనే కుప్ప‌కూలిపోయాడు. బ‌స్సు ర‌న్నింగ్‌లోనే ఉంది. దీంతో బ‌స్సు ఆగి ఉన్న వాహ‌నాలు ఢీ కొడుతూ ముందు వెళ్లి ఆగిపోయింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

హ‌ర్‌దేవ్ ప‌టేల్ అనే వ్య‌క్తి జ‌బ‌ల్‌పూర్‌లో ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. రోజు మాదిరిగా శుక్ర‌వారం కూడా విధులకు హాజ‌ర‌య్యాడు. బ‌స్సు న‌డుపుతుండ‌గా ఒక్క‌సారిగా గుండెపోటు రావ‌డంతో స్టీరింగ్‌పైనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ స‌మ‌యంలో బ‌స్సు ర‌న్నింగ్‌లోనే ఉంది. ఓ ట్రాఫిక్ సిగ్న‌ల్ వ‌ద్ద ఆగి ఉన్న ఆటో, కొన్ని బైకుల‌ను కొద్ది దూరం లాక్కెళ్లి ఆగింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ వృద్ధుడు మ‌ర‌ణించాడు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. బ‌స్సు డ్రైవ‌ర్‌, వృద్దుడి మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వాసుప‌త్రికి తీసుకువెళ్లారు. లోఫ్లోర్ బ‌స్సు కావ‌డంతో బ‌స్సు కింద ఎవ‌రూ ప‌డ‌లేద‌ని పోలీసులు తెలిపారు. ఒక‌వేళ ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సు వేగం అధికంగా ఉండి ఉంటే ప్ర‌మాద తీవ్ర‌త మ‌రింత ఎక్కువ‌గా ఉండేద‌ని స్థానికులు చెప్పారు. ఈ ఘ‌ట‌న మొత్తం సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రమాద దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story