మొబైల్‌లోని సిమ్‌ కార్డ్‌ మాత్రమే కొట్టేశాడు.. ఇదో కొత్త తరహా దొంగతనం.. జాగ్రత్త.!

Driver arrested in Bengaluru for stealing SIM of customer to withdraw money from her bank account

By అంజి  Published on  9 Aug 2022 5:37 PM IST
మొబైల్‌లోని సిమ్‌ కార్డ్‌ మాత్రమే కొట్టేశాడు.. ఇదో కొత్త తరహా దొంగతనం.. జాగ్రత్త.!

ఇటీవల కాలంలో దొంగల తెలివి మరీ మితిమీరిపోయింది. సామాన్య ప్రజలు ఊహించని రీతిలో దొంగలు చోరీలు చేస్తున్నారు. కొంచెం అజాగ్రత్తగా ఉంటే చాలు.. క్షణాల్లో లక్షల రూపాయలు అపహరిస్తున్నారు. ఇలాంటి ఘటనే కర్నాటక రాష్ట్రం బెంగళూరులో వెలుగు చూసింది. ఓ క్యాబ్‌ డ్రైవర్‌ తన క్యాబ్‌ ఎక్కిన ప్రయాణీకురాలిని బురిడీ కొట్టించాడు. ప్రయాణం మధ్యలో కాస్త రిలాక్సేషన్‌ కోసం కారును ఆపాడు. ఆమె దృష్టిని మళ్లించి.. మొబైల్‌ కొట్టేస్తే అనుమానం వస్తుందని ఏమో.. ఆమెకు తెలియకుండా మొబైల్‌ తీసుకుని, అందులోని సిమ్‌ కార్డు మాత్రమే దొంగిలించాడు.

మహిళ కారులోంచి దిగిన తర్వాత.. ఆ సిమ్‌ కార్డును తన మొబైల్‌లో వేసుకుని యూపీఐ యాప్స్‌ యాక్టివేట్‌ చేశాడు. తెలిసిన అన్ని ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ యాప్స్‌ను ఓపెన్‌ చేసి, సిమ్ కార్డుతో యాక్టివేట్‌ అయిన యాప్‌లను ఓపెన్‌ చేశాడు. ఆ తర్వాత వాటి ద్వారా తన అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాడు. ఇలా రూ.3.45 లక్షలపైగా కొట్టేశాడు. దొంగతనం చేయగా వచ్చిన డబ్బుతో కొత్త మొబైల్ ఫోన్‌, స్కూటర్ కొనుగోలు చేశాడు. తన అకౌంట్‌ నుంచి భారీ మొత్తంలో డబ్బు పోవడం గమనించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

నిందితుడిని దుద్దాకు చెందిన ప్రకాష్ అని పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి అనేక ఇతర డూప్లికేట్ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతని నేర నేపథ్యాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు తమ ఫోన్‌ను పోగొట్టుకుంటే వెంటనే.. సిమ్‌ కార్డును బ్లాక్‌ చేయాలని పోలీసులు సూచించారు. అలాగే యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లు చెల్లింపు ప్రక్రియను ప్రారంభించే ముందు బహుళ ప్రామాణీకరణను తప్పనిసరి చేయాల్సి ఉందని ఒక పోలీసు అధికారి తెలిపారు.


Next Story