Hyderabad: పులి గోర్లు, దంతాల అక్రమ రవాణా గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్

వన్యప్రాణుల అక్రమ వ్యాపారంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), హైదరాబాద్ జోనల్ యూనిట్ కీలక ఆపరేషన్ నిర్వహించింది.

By -  అంజి
Published on : 10 Feb 2026 11:53 AM IST

DRI Officials, Arrest, Illegal Trade of Tiger Claws and Teeth, Hyderabad

Hyderabad: పులి గోర్లు, దంతాల అక్రమ రవాణా గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్

వన్యప్రాణుల అక్రమ వ్యాపారంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), హైదరాబాద్ జోనల్ యూనిట్ కీలక ఆపరేషన్ నిర్వహించింది. పులి (టైగర్) అవయవాలను అక్రమంగా గ్రే మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఏడు పులి గోర్లు, మూడు పులి దంతాలు (కేనైన్ టీత్) స్వాధీనం చేసుకున్నారు.

ఫిబ్రవరి 9, 2026న పులి గోర్లు, దంతాల అక్రమ రవాణాకు సంబంధించిన నమ్మదగిన సమాచారం అందడంతో, డీఆర్‌ఐ హైదరాబాద్ యూనిట్ ప్రత్యేక ఆపరేషన్‌కు ప్రణాళిక రూపొందించింది. ఆ మేరకు అదే రోజు సమన్వయంతో కూడిన వేగవంతమైన చర్య చేపట్టి, అనుమానితులను గుర్తించి అడ్డుకున్నారు.

తనిఖీల్లో భాగంగా ప్రశ్నించగా, నిందితుల్లో ఒకరు తన బ్యాక్‌ప్యాక్‌లోని పారదర్శక జిప్‌లాక్ కవర్‌ను బయటకు తీసి చూపించాడు. పరిశీలించగా అందులో ఏడు పులి గోర్లు, మూడు పులి దంతాలు ఉండగా, అవి పులి (Panthera tigris) శరీర భాగాలుగా అధికారులు నిర్ధారించారు.

పులి షెడ్యూల్–1 జంతువు

పులి (Panthera tigris) వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 (సవరణలతో) ప్రకారం షెడ్యూల్–1 కింద అత్యంత రక్షిత జాతిగా గుర్తించబడింది. పులి శరీర భాగాలను కలిగి ఉండటం లేదా వాటి వ్యాపారం చేయడం చట్టరీత్యా నేరం కాగా, కఠిన శిక్షలకు లోబడి ఉంటుంది.

ఈ ఘటనలో స్వాధీనం చేసుకున్న పులి గోర్లు, దంతాలతో పాటు వాటిని దాచేందుకు ఉపయోగించిన ప్యాకింగ్ మెటీరియల్, బ్యాగ్‌ను కూడా వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అధికారులు సీజ్ చేశారు.

పట్టుబడిన ఇద్దరు అక్రమ రవాణాదారులను, స్వాధీనం చేసుకున్న వన్యప్రాణి అవయవాలు, బ్యాక్‌ప్యాక్, ప్యాకింగ్ మెటీరియల్, వారు ఉపయోగించిన మొబైల్ ఫోన్లతో కలిసి తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 కింద మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

వన్యప్రాణుల అక్రమ వ్యాపారంపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Next Story