హైదరాబాద్: ఓ డాక్యుమెంట్ రైటర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా కొత్తూరులో చోటుచేసుకుంది. బాధితుడిని కరుణాకర్ రెడ్డిగా గుర్తించారు. మల్లాపూర్ గ్రామానికి చెందిన 29 ఏళ్ల మామిడి కరుణాకర్ ఓ పత్రికలో విలేకరిగా పని చేసేవాడు. అయితే కొద్ది నెలల క్రితమే ఆ ఉద్యోగం మానేశాడు. ఆ తర్వాత కొత్తూరు ఎమ్మార్వో కార్యాలయంలో డాక్యుమెంటర్ రైటర్‌గా పని చేశాడు. అతడిని నలుగురు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత కారులో అతడిని తీవ్రంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో నలుగురు వ్యక్తులు అతన్ని గచ్చిబౌలిలోని ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ చేర్చి తప్పించుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నిందితులను గుర్తించిన పోలీసులు బాధితుడికి, అతని హంతకులకు మధ్య కొన్ని వ్యక్తిగత కక్షలు ఉన్నాయని చెప్పారు. కారులోనే కరుణాకర్ రెడ్డిని కర్రలతో కొట్టారని, దీంతో అతనికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కరుణాకర్ రెడ్డి హత్యకు కొత్తూరు మండల స్థాయి ప్రజా ప్రతినిధియే కారణం అని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రజా ప్రతినిధికి, కరుణాకర్‌రెడ్డికి మధ్య విబేధాలు రావడంతో వారి మధ్య గొడవలు జరిగాయని చెబుతున్నారు. కరుణాకర్ రెడ్డి హత్య జరిగినప్పటి నుంచి ప్రజా ప్రతినిధి, ఆయన అనుచరుల ఫోన్లు స్విచ్ఛాఫర్ లో ఉన్నాయని.. వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.