నారాయణపేట జిల్లాలో దారుణ ఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం మద్దూర్‌లోని పిహెచ్‌సి వెనుక ఓ వికలాంగ మహిళపై వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ మహిళకు నిప్పంటించాడు. బాధిత మహిళ మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 22 ఏళ్ల యువతి మద్దూరు మండలానికి చెందినది. జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిన ఆమె తండ్రి రాజేంద్రనగర్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్నారు. నిందితుడు నింజమూరు గ్రామానికి చెందిన జె వెంకటయ్యగా పోలీసులు గుర్తించారు. అతడు ఇద్దరు పిల్లల తండ్రి. కాగా బాధితురాలితో నిందితుడికి పరిచయం ఉంది. ఇటీవల కార్యక్రమంలో పాల్గొనేందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు స్వగ్రామానికి బయలుదేరారు. ఫిబ్రవరి 14న ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించలేదు. దీంతో ఆమె తండ్రి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిబ్రవరి 18న మద్దూరులోని పీహెచ్‌సీ వెనుక ఓ మహిళ నిప్పంటించుకుని సహాయం కోసం కేకలు వేయడాన్ని ప్రజలు గమనించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, మహిళను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కోస్గి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి జనార్దన్ గౌడ్ తెలిపారు. కాలిన గాయాలతో చనిపోయే ముందు వెంకటయ్య తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తెలియజేసినట్లు బాధితురాలి తల్లి పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి వెంకటయ్య తనపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని ఆమె తల్లి ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.