త‌ప్పించుకుని తిరుగుతున్న‌ 20 ఏళ్ల క్రితం మ‌ర్డ‌ర్‌ కేసు నిందితుడు.. పోలీసులు ఎలా అరెస్ట్ చేశారంటే.?

ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను అపహరించి హత్య చేసిన కేసులో రెండు దశాబ్దాలుగా దొరక్కుండా తిరుగుతున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేశారు

By Medi Samrat  Published on  23 May 2024 5:01 PM IST
త‌ప్పించుకుని తిరుగుతున్న‌ 20 ఏళ్ల క్రితం మ‌ర్డ‌ర్‌ కేసు నిందితుడు.. పోలీసులు ఎలా అరెస్ట్ చేశారంటే.?

ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను అపహరించి హత్య చేసిన కేసులో రెండు దశాబ్దాలుగా దొరక్కుండా తిరుగుతున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలోని రామ్‌లీలా మైదాన్ సమీపంలో పూరీలను అమ్మే వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు. పోలీసుల అరెస్టు నుండి తప్పించుకోవడానికి సదరు వ్యక్తి తన గుర్తింపును మార్చుకున్నాడు. ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌కి చెందిన అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) సోను నైన్ మామిడికాయలు అమ్మేవారిగా నటించి ఎట్టకేలకు పట్టుకున్నారు. 'గురుదయాల్ అలియాస్ సిపాహి లాల్' కదలికలను పర్యవేక్షించడానికి మెయిన్‌పురిలోని రాంలీలా మైదాన్ సమీపంలో పోలీసులు ప్రత్యేకంగా ఒక స్టాల్‌ను కూడా ఏర్పాటు చేశారు.

20 ఏళ్ల నాటి ఈ కేసు వివరాలను పోలీసులు పంచుకున్నారు.. అక్టోబర్ 31, 2004న ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతానికి చెందిన రమేష్ చంద్ గుప్తా అనే వ్యాపారవేత్త శాంత్రో కారులో బయటకు వెళ్ళాడు. అయితే అతడు ఇంటికి తిరిగి చేరుకోలేదని అధికారులు తెలిపారు. ఆజాద్‌పూర్ మండిలో తనకు తెలిసిన ముఖేష్ వత్స్ ను కలవడానికి వెళ్తున్నట్లు రమేష్ చంద్ గుప్తా తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. రమేష్ సోదరుడు జగదీష్ కుమార్ షాలిమార్ బాగ్ పోలీస్ స్టేషన్‌లో అప్పట్లో ఫిర్యాదు చేశాడు. నవంబర్ 2, 2004న, బహదూర్‌ఘర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో రమేష్ చంద్ర గుప్తా వాహనాన్ని కనుగొన్నారు. అయితే అతడి జాడ మాత్రం కనిపించలేదు.

కుటుంబసభ్యుల ఫిర్యాదు, అనుమానాల కారణంగా అధికారులు ముఖేష్ ను అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) రాకేష్ పవారియా మాట్లాడుతూ విచారణలో.. ముఖేష్ తన సహచరులైన సిపాహి లాల్, షరీఫ్ ఖాన్, కమలేష్, రాజేష్‌లతో కలిసి గుప్తాను కిడ్నాప్ చేసి, ఆపై హత్య చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. షరీఫ్ ఖాన్, కమలేష్, రాజేష్, సిపాహి లాల్‌లతో ఆజాద్‌పూర్ మండిలో ముఖేష్ కూరగాయల వ్యాపారాన్ని నడిపారు. నిందితులు మృతదేహాన్ని గోనె సంచిలో దాచి కరాలా గ్రామానికి సమీపంలోని డ్రైనేజీ కాలువలో పడేశారు. పోలీసులు కరాలాలో షరీఫ్ ఖాన్, కమలేష్‌లను అరెస్టు చేశారు.. వాళ్ళు చెప్పిన ప్రాంతంలో రమేష్ చంద్ర గుప్తా అవశేషాలు కూడా కనుగొన్నారు. అయినప్పటికీ.. సిపాహి లాల్, రాజేష్ తప్పించుకోగలిగారు.

ఇటీవల, మెయిన్‌పురిలోని రాంలీలా మైదాన్ సమీపంలో సిపాహి లాల్ వేరే పేరుతో చోలే భతురే లను విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. అతని కదలిక, కార్యకలాపాలను గుర్తించడానికి.. ASI సోను నైన్‌ను అక్కడ మామిడికాయలు అమ్మేవారి వేషంలో ఉంచారు. రెండు రోజుల తర్వాత సిపాహిలాల్ తన గుర్తింపును మార్చుకుని గురుదయాల్‌ పేరుతో వ్యాపారం చేస్తున్నాడ‌ని ASI కనుగొన్నాడు. మొదట గురుదయాల్‌గా బుకాయించడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసుల విచారణలో తన అసలు పేరు, గుర్తింపును వెల్లడించాడు. నిందితుడిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

Next Story