హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. కాగా 31 మంది నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. 27 మంది రోగుల ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు నిమ్స్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. డాక్టర్లు అందిస్తున్న చికిత్సకు వారు కోలుకుంటున్నట్లు తెలిపింది. అయితే మిగతా నలుగురికి డయాలసిస్ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ పేర్కొంది.
అయితే కల్తీ కల్లు ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కల్తీ కల్లుకు పాల్పడిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని బాలానగర్ ఎక్సైజ్ పీఎస్‌లో విచారిస్తున్నారు. ఇప్పటికే బాలనగర్ ఎక్సైజ్ పీఎస్‌లో ఐదు, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ పీఎస్‌లలో మూడు కేసులు నమోదయ్యాయి. ఐదు కల్లు కాంపౌండ్‌ల నుంచి శాంపిల్స్ సేకరించి నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్‌కు పంపారు.