Uttarpradesh: చిన్నారుల వీడియోలు డార్క్ వెబ్‌లో అమ్మిన దంపతులకు ఉరిశిక్ష

చైల్డ్ అబ్యూస్ కేసులో నిందితులైన దంపతులకు బందాలోని పోక్సో (POCSO) ప్రత్యేక కోర్టు శుక్రవారం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

By -  Knakam Karthik
Published on : 20 Feb 2026 9:00 PM IST

National News, Uttarpradesh, Child Abuse Case, Death Penalty, Dark Web Crime, POCSO Verdict

Uttarpradesh: చిన్నారుల వీడియోలు డార్క్ వెబ్‌లో అమ్మిన దంపతులకు ఉరిశిక్ష

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఆరేళ్ల క్రితం జరిగిన అత్యంత దారుణమైన చైల్డ్ అబ్యూస్ కేసులో నిందితులైన దంపతులకు బందాలోని పోక్సో (POCSO) ప్రత్యేక కోర్టు శుక్రవారం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులు ఇరిగేషన్ విభాగంలో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేసిన రామ్ భవన్ మరియు అతని భార్య దుర్గావతి. వీరు చిన్నారులను లైంగికంగా వేధించడమే కాకుండా, ఆ దృశ్యాలను వీడియోలు తీసి డార్క్ వెబ్ (Dark Web)లో విదేశీయులకు విక్రయించేవారు.

సుమారు 5 నుండి 16 ఏళ్ల వయస్సు గల 33 మందికి పైగా చిన్నారులను వీరు వేధించినట్లు సీబీఐ (CBI) విచారణలో తేలింది. వీరు దాదాపు 2 లక్షలకు పైగా అశ్లీల వీడియోలను 47 దేశాలకు చెందిన క్లయింట్లకు పంపినట్లు సమాచారం. 2020లో సీబీఐ వీరిని అరెస్ట్ చేసిన సమయంలో నిందితుల వద్ద నుంచి రూ.8 లక్షల నగదు, 12 మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు మరియు భారీగా డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు.

మరణశిక్షతో పాటు, బాధితుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలా రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన దుర్గావతిపై కూడా కోర్టు తీవ్రంగా మండిపడింది. చిన్నారుల పట్ల ఇంతటి కర్కశత్వానికి పాల్పడిన దంపతులకు ఉరిశిక్ష విధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Next Story