మరికాసేపట్లో కుమారై వివాహం.. వధువు తల్లిదండ్రుల ఆత్మహత్య
Daughter marriage parents commit suicide in Visakhapatnam.ఆ కల్యాణ మండపంలో పెళ్లి జరుగుతోంది. బంధు మిత్రులతో
By తోట వంశీ కుమార్ Published on 27 Aug 2021 9:29 AM IST
కల్యాణ మండపంలో పెళ్లి జరుగుతోంది. బంధు మిత్రులతో కళ్యాణ మండపం సందడిగా ఉంది. పెళ్లి తంతు ప్రారంభమైంది. కన్యాదానం చేయాల్సిన సమయం వచ్చింది. పురోహితుడు వధువు తల్లిదండ్రులను పిలిచాడు. వాళ్లు ఎంతసేపటికి కూడా రాలేదు. కళ్యాణ మండపం మొత్తం వెతికినా వారు కనపడ లేదు. అనూహ్యంగా ఆ వధువు తల్లి దండ్రులు ప్రాణాలు కోల్పోయిన స్థితిలో కనిపించారు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఈ ఘటన విశాఖ జిల్లా మద్దిలపాలెంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జగన్నాథరావు (63), విజయలక్ష్మి (57) దంపతులు మద్దిపాలెంలో నివసిస్తున్నారు. జగన్నాథరావు రిటైర్డ్ ఉద్యోగి. వీరి కుమారైకు పెళ్లి నిశ్చయించారు. ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి వేడుకకు ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేశారు. కన్యాదాన సమయం రావడంతో.. పురోహితుడు ఆ దంపతులను పిలిచాడు. అయితే.. అప్పటి వరకు అక్కడే ఉన్న వారు సడెన్ కనిపించలేదు. ఫంక్షన్ హాల్ మొత్తం వెతికినా లాభం లేకపోయింది. దీంతో బంధువులు ఇంటికి వెళ్లి చూడగా.. ఓ గదిలో విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా.. గత కొంతకాలంగా విజయలక్ష్మి మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇరుగుపొరుగు వారితో విజయలక్షితో గొడవ పడుతున్నట్లు తెలిసింది. ఇక కుమారై పెళ్లి రోజున ఆమె భర్తతో గొడవ పడినట్లు బంధువులు తెలిపారు. ఈ కారణంగానే విసుగుచెందిన జగన్నాథరావు.. విజయలక్ష్మిని చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు బావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.