ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఆదివారం లక్నోలో 14 ఏళ్ల దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత నిందితులు ఆమె తలపై ఇటుకతో కొట్టారని పోలీసులు తెలిపారు. లక్నోలోని బక్షి కా తలాబ్ ప్రాంతంలో ఆదివారం, సెప్టెంబరు 8వ తేదీ, బాలిక ఆహార దుకాణానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటన అనంతరం బాలిక ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి ఘటనపై స్థానిక పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.
ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (POCSO), SC/ST చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఫిర్యాదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు అందిన వెంటనే నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు అనేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ సంఘటన గురించి లక్నో నార్త్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అభిజిత్ ఆర్ శంకర్ మాట్లాడుతూ.. ''అమ్మాయి ఫిర్యాదు ఆధారంగా, BNS, POSCO, SC/ST చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద బక్షి కా తలాబ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. నిందితుల్లో ఒకరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు'' అని తెలిపారు.