బీహార్‌లో తెలంగాణ పోలీసులపై.. సైబర్ నేరగాళ్ల కాల్పులు
Cybercriminals firing on Telangana Police in Bihar. బీహార్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. అరెస్ట్ చేయడానికి వచ్చిన తెలంగాణ పోలీసులపై కాల్పులు జరిపారు.
By అంజి Published on 15 Aug 2022 12:31 AM GMTబీహార్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. అరెస్ట్ చేయడానికి వచ్చిన తెలంగాణ పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటన బీహార్‌లో నవాడా జిల్లాలో కలకలం రేపింది. గత కొంత కాలంగా ఆటోమొబైల్ కంపెనీకి డీలర్‌షిప్ ఇపిస్తామని వ్యాపారులను మితిలేష్ ప్రసాద్ ముఠా మోసగిస్తూ.. తప్పించుకు తిరుగుతోంది. ఈ క్రమంలోనే ముఠా నవాడా జిల్లాలోని భవానిబి గ్రామంలో ఉంటోందని పోలీసులు గుర్తించారు. శనివారం అర్ధరాత్రి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠా ప్రధాన సూత్రధారి మితిలేష్ ప్రసాద్ ఇంటిపై బీహార్ పోలీసుల సాయంతో తెలంగాణ పోలీసులు దాడి చేశారు.
ఈ క్రమంలోనే అతడు పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యాడు. మిగిలిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.22 కోట్ల నగదు, ఐదు స్మార్ట్‌ఫోన్‌లు, మూడు లగ్జరీ కార్లు, మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మితిలేష్ ప్రసాద్ తండ్రి సురేంద్ర మహ్తోను అరెస్టు చేశామని, వారి ఇంటి బయట పార్క్ చేసిన మూడు లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని నవాడా పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ మంగ్లా తెలిపారు. ఆ తర్వాత మరో ముగ్గురు నిందితులు భూతాలి రామ్, మహేష్ కుమార్ మహ్తో, జితేంద్ర కుమార్‌లను అరెస్టు చేశారు.
ఈ ముఠా ఫ్రాంచైజీల పేరుతో వ్యక్తుల నుంచి ఆర్థిక వివరాలను తీసుకుని దేశవ్యాప్తంగా మోసం చేస్తుందని మంగ్లా చెప్పారు. ''తెలంగాణ పోలీసులు ప్రధానంగా మిథిలేష్‌ను అరెస్టు చేసేందుకు నవాడా వచ్చారు. అరెస్టు చేసిన నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు'' అని మంగ్లా తెలిపారు. తెలంగాణ పోలీసులు పాట్నా, న్యూఢిల్లీ, కోల్‌కతాలో కూడా దాడులు నిర్వహించి పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు బృందంపై కాల్పులు, మద్యం రికవరీకి సంబంధించి ఆదివారం తాజా కేసు నమోదు చేసినట్లు మంగ్లా తెలిపారు.