1125 యూపీఐ ట్రాన్సక్షన్లు.. రూ.4 కోట్ల మోసం.. వారి టార్గెట్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌

రూ.4 కోట్ల యూపీఐ మోసానికి పాల్పడిన 13 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

By అంజి  Published on  9 Sep 2024 10:45 AM GMT
cyberabad police, arrest, UPI fraud, Bajaj Electronics

1125 యూపీఐ ట్రాన్సక్షన్లు.. రూ.4 కోట్ల మోసం.. వారి టార్గెట్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ 

హైదరాబాద్‌: రూ.4 కోట్ల యూపీఐ మోసానికి పాల్పడిన 13 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా హై-టెక్ యూపీఐ మోసాలు, చీటింగ్‌లలో పాలుపంచుకుంది. ప్రముఖ వ్యాపార సంస్థ అయిన బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ను దాదాపు రూ. 4 కోట్ల మోసం చేసింది. ముఠా నుంచి రూ.1.72 లక్షల నగదును, రూ.50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్‌ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్‌లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్‌కు ఈ ముఠా కుచ్చు టోపీ పెట్టింది.

మొత్తం రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు పలు మోసాలు, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ ముఠా పద్ధతి ప్రకారం మోసాలు చేసింది. ముందుగా ముఠా సభ్యులు వస్తువుల కొనడానికి బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్‌కు వెళ్తారు. విలువైన వస్తువుల కొనుగోలు చేసిన తర్వాత యూపీఐ చెల్లింపులు చేస్తారు. అందుకోసం బజాజ్‌ షోరూమ్‌లోని క్యూఆర్‌ కోడ్‌ను రాజస్థాన్‌లోని సహచరులకు పంపుతారు. అక్కడి నుంచి క్యూఆర్‌ కోడ్‌తో డబ్బులు పంపిస్తారు. వస్తువులు డెలివరీ అయిన తర్వాత పొరపాటున వేరే ఖాతాకు డబ్బులు బదిలీ చేశామనంటూ రాజస్థాన్‌లోని సహచరులు బ్యాంక్‌లో ఛార్జ్‌బ్యాక్ ఫిర్యాదును దాఖలు చేస్తారు. తద్వారా లావాదేవీ రివర్స్ అవుతుంది. డబ్బు ముఠా ఖాతాకు తిరిగి వస్తుంది.

రాజస్థాన్‌కు చెందిన కొందరు యువకులు ముఠాగా ఏర్పడి ఈ యూపీఐ మోసాలకు పాల్పడుతున్నారు. యూపీఐ మోసాలతో కొనుగోలు చేసిన వస్తువులను ఇతరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గడిచిన రెండు నెలల్లో 1125 యూపీఐ ట్రాన్సక్షన్లు జరిగినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. ముఠాకు చెందిన వారిలో 13 మంది అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

Next Story