ప్రాణాలమీదికి తీసుకొచ్చిన పెరుగు
హోటల్ కి వెళ్లి ఎక్స్ట్రా పెరుగు అడిగినందుకు హోటల్ సిబ్బంది కస్టమర్‌పై ఒక్కసారిగా దాడి చేయడంతో అతను మృతి చెందాడు.
By అంజి Published on 11 Sept 2023 9:09 AM ISTప్రాణాలమీదికి తీసుకొచ్చిన పెరుగు
హైదరాబాద్: హోటల్ కి వెళ్లి ఎక్స్ట్రా పెరుగు అడిగినందుకు హోటల్ సిబ్బంది కస్టమర్‌పై ఒక్కసారిగా దాడి చేయడంతో అతను మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. చాంద్రాయణ గుట్టకు చెందిన లియాకత్ అనే వ్యక్తి బిర్యానీ తినేందుకు మెరీడియన్ హోటల్ కి వెళ్ళాడు. అక్కడ బిర్యానీ తింటున్న సమయంలో ఎక్స్ట్రా పెరుగు తీసుకొని రావాలని అడగడంతో సిబ్బందికి, లియాకత్ కు మధ్య గొడవ మొదలైంది. దీంతో ఆగ్రహానికి లోనైనా హోటల్ సిబ్బంది హోటల్లోనే లియాకత్ పై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. గొడవ పెద్దదవ్వడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు ఇరువురిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీస్ స్టేషన్లో మాట్లాడుతుండగా.. లియాకత్ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు.
అది గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే అతని స్థానిక డెక్కన్ హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్లో చికిత్స అందిస్తుండగానే లియాకత్ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ మార్చరికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే మృతుడి స్నేహి తులు డెక్కన్ హాస్పిటల్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. దాడి జరిగిన తర్వాత హాస్పిటల్ కి తరలించకుండా పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లడంతోనే మృతి చెందాడని లియాకత్ స్నేహితులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మెల్సీ పోలీసులను కోరారు. పోలీసులు మెరీడియన్ హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.