Hyderabad: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కస్టోడియల్ డెత్
గచ్చిబౌలి పోలీసు కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి మరణించడం కలకలం రేపింది. ఓ కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు.. పోలీస్‌స్టేషన్‌లో కుప్పకూలిపోయాడు.
By అంజి Published on 17 July 2023 1:08 AM GMTHyderabad: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కస్టోడియల్ డెత్
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీసు కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి మరణించడం కలకలం రేపింది. ఓ కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు.. పోలీస్‌స్టేషన్‌లో కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు బీహార్‌కు చెందిన వ్యక్తి. కొంతకాలం కిందట పొట్టకూటి కోసం గచ్చిబౌలి ప్రాంతానికి వలస వచ్చాడు. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ ద్వారా నానక్‌రాంగూడాలోని సుమధుర కన్స్ట్రక్షన్ లేబర్ క్యాంప్‌లో సెక్యూరిటీగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
రాత్రి 11.30 తర్వాత లేబర్ క్యాంప్‌లో ఉన్న కూలీలను బయటకు పంపొద్దనే రూల్స్ ఉంది. శనివారం రాత్రి సమయంలో కొందరు బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వారిని నితీష్ సహా మరికొందరు సెక్యూరిటీ గార్డులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. నితీష్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఇనుపరాడ్‌తో దాడి చేయడంతో ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
నితీష్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు బిట్టు, వికాస్‌ని అర్థరాత్రి పోలీస్‌స్టేషన్‌కి తీసుకువచ్చి సెక్షన్ 324 కింద కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. ఈ క్రమంలోనే నిన్న ఉదయం సమయంలో నితీష్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఉదయం జరిగిన ఘటన రాత్రి సమయంలో బయటకు పొక్కింది. ఈ విషయమై మదాపూర్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ.. నిందితుడు గుండెపోటు వల్లే మృతి చెందాడని తెలిపారు.