కొత్త రకం మోసం.. క్రెడిట్ కార్డును కవర్ నుంచి తీయకుండానే రూ.1.10 లక్షలు మాయం
Credit Card Fraud. కొరియర్‌లో వచ్చిన క్రెడిట్ కార్డును కవర్ నుంచి తీయకముందే సైబర్ నేరగాళ్లు ఆ కార్డు నుంచి రూ.1.10 లక్షలు మాయం
By Medi Samrat Published on 28 Feb 2021 11:52 AM IST
కొరియర్‌లో వచ్చిన క్రెడిట్ కార్డును కవర్ నుంచి తీయకముందే సైబర్ నేరగాళ్లు ఆ కార్డు నుంచి రూ.1.10 లక్షలను కొల్లగొట్టిన ఘటన సంచలనం రేపుతోంది. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన ఐటీ ఉద్యోగి సాయితేజేశ్వరరెడ్డికి ఓ షాపింగ్ మాల్‌లో కలిసిన రిప్రజెంటేటివ్ ఎలాంటి చార్జీలు లేకుండా క్రెడిట్ కార్డు ఇస్తానంటూ వివరించాడు. కానీ సంస్థ ప్రతినిధులు డిస్పాచ్‌కు ముందు ఏడాదికి రూ.2 వేలు సర్వీస్ చార్జ్ అని చెప్పాడు. దాంతో తనకు క్రెడిట్ కార్డు వద్దన్నా.. ఆర్‌బీఎల్ ప్రతినిధులు కార్డును పంపించారు.
అయితే బాధితుడు కొరియర్ ద్వారా ఫిబ్రవరి 2న క్రెడిట్ కార్డు అందింది. ఆ కార్డు వాడటం ఇష్టం లేని సాయితేజేశ్వరరెడ్డి దానిని తిరిగి బ్యాంకులో అప్పగించేందుకు కవర్ కూడా తీయకుండా అలాగే ఉంచాడు. ఈనెల 24న బాధితుడికి ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి హిందీలో మాట్లాడుతూ.. ఆర్‌బీఎల్ ప్రతినిధులమని పరిచయం చేసుకున్నాడు.
అయితే సాయితేజేశ్వరరెడ్డికి హిందీ అర్ధం కాకపోవడంతో ఫోన్ కట్ చేశాడు. వారు పలుమార్లు ఫోన్ చేసి సంప్రదించే ప్రయత్నం చేసినా స్పందించలేదు. ఫోన్ల తర్వాత క్రెడిట్ కార్డు నుంచి రూ.76,820, రూ.21,420, రూ.12,712 ఇలా మూడు సార్లు షాపింగ్ చేసినట్లు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో షాక్‌కు గురైన సాయితేజేశ్వరరెడ్డి ఆ మెసేజ్‌లు నిమిషాల వ్యవధిలో మాయమయ్యాయి. అయోమయానికి గురైన బాధితుడు ఆర్‌బీఎల్ బ్యాంకును సంప్రదించగా, క్రెడిట్ కార్డుతో షాపింగ్ జరిగినట్లు నిర్ధారించారు. ఆ లావాదేవీలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. అలాగే కార్డును బ్లాక్ చేయించాడు. ఇక బ్యాంకు వారు స్పందించకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.