విషాదం.. పెళ్లయిన కొన్ని గంటలకే వరుడు, వధువు మృతి
బీహార్‌లోని నలంద జిల్లాలో పెళ్లయిన కొద్ది గంటలకే వధూవరులు కలిసి చనిపోయారు. క్షణాల్లో రెండు కుటుంబాల్లో సంతోషం
By అంజి Published on 7 May 2023 9:45 AM ISTవిషాదం.. పెళ్లయిన కొన్ని గంటలకే వరుడు, వధువు మృతి
బీహార్‌లోని నలంద జిల్లాలో పెళ్లయిన కొద్ది గంటలకే వధూవరులు కలిసి చనిపోయారు. క్షణాల్లో రెండు కుటుంబాల్లో సంతోషం శోకసంద్రంగా మారింది. వరుడు తన వధువును తీసుకెళ్తున్న కారును వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. దీంతో వధూవరులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో వరుడి బావ మరిదికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రాక్టర్‌తోపాటు పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన బీహార్‌లోని నలంద జిల్లా గ్రామంలో చోటుచేసుకుంది.
ఈ సంఘటన నలందలోని గిరియాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురాణి గ్రామ సమీపంలో జరిగింది. శుక్రవారం నాడు, గిరియాక్‌లోని సతువా గ్రామానికి చెందిన చౌదరి కుమార్తె పుష్ప కుమారి (20 సంవత్సరాలు) వివాహం నవాడా మహారాణా గ్రామానికి చెందిన శ్యామ్ కుమార్ (27 సంవత్సరాలు)తో జరిగింది. శనివారం మధ్యాహ్నం ఇన్నోవా కారులో శ్యామ్ తన వధువు పుష్ప, బావమరిదితో తన గ్రామం మహారాణాకు బయలుదేరాడు. మధ్యాహ్నం 3-4 గంటల మధ్య ఆయన కారు పురైని గ్రామ సమీపంలోకి రాగానే వేగంగా వస్తున్న ఇసుకతో కూడిన ట్రాక్టర్ కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డుపై నుంచి కిందకు పడిపోయింది. శ్యామ్, పుష్ప అక్కడికక్కడే మృతి చెందారు. శ్యామ్ బావమరిది, కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వధూవరుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని, తీవ్రంగా గాయపడిన బావమరిదిని చికిత్స నిమిత్తం విమ్స్‌కు తరలించారు. కారును ఢీకొట్టిన తర్వాత నిందితుడు ట్రాక్టర్‌తో సహా పరారయ్యాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. క్షణంలో ఆనందం దుఃఖంగా మారింది. ఇలా జరుగుతుందని తెలియక కూతుర్ని సంతోషంగా తన అత్తారింటికి పంపించామని కుటుంబ సభ్యులు చెప్పారు.
సతువులో ప్రతిరోజూ పెద్దఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇసుక తవ్వకాలు సాగించే వారు ట్రాక్టర్‌లో ఇసుకను నింపి వాహనాన్ని అతివేగంతో నడుపుతూ రోడ్డుపైనే వెళ్తున్నారు. దీంతో ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇసుక అక్రమ దందాతో పోలీసులు కూడా కుమ్మక్కయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.