ప్రియుడి ఆత్మహత్య.. తట్టుకోలేక ప్రియురాలు కూడా..
వేరే వర్గానికి చెందిన వ్యక్తితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 4 Oct 2023 7:00 AM ISTప్రియుడి ఆత్మహత్య.. తట్టుకోలేక ప్రియురాలు కూడా..
హైదరాబాద్: ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక ఓ ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ప్రియుడు మరణించడంతో అతడు లేని జీవితం తనకు వద్దని బలవన్మరణానికి పాల్పడింది ఓ ప్రియురాలు. ఈ విషాదకరమైన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్నపల్లి జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఒక హాస్టల్లో నివాసం ఉంటున్న నేహా(19) అనే అమ్మాయి బరిష్టా కేఫ్‌లో ఉద్యోగం చేస్తోంది. అదే కేఫ్‌లో సహ ఉద్యోగిగా పని చేస్తున్న సల్మాన్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల సభ్యులకు తెలియజేశారు. కానీ ఈ ఇద్దరి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు.
ఈ క్రమంలోనే బాలాపూర్‌లోని వెంకటాపు రంలో నివాసముం టున్న సల్మాన్ తీవ్ర మనస్థాపానికి గురై శనివారం రోజు తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సల్మాన్ మరణాన్ని తట్టుకోలేక నేహా మనస్థాపానికి గురైంది. ప్రియుడు లేని జీవితం తనకు వద్దని నిన్న తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అది గమనించిన నేహ అక్క వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ ప్రేమ జంట మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.