విషాదం.. జుట్టు మార్పిడి తర్వాత కానిస్టేబుల్ మృతి
Constable dies after hair transplant in Bihar. బీహార్ మిలటరీ పోలీస్ కి చెందిన ఒక కానిస్టేబుల్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న ఒక రోజు తర్వాత గుండె
By అంజి Published on 12 March 2022 12:57 PM ISTబీహార్ మిలటరీ పోలీస్ కి చెందిన ఒక కానిస్టేబుల్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న ఒక రోజు తర్వాత గుండెపోటుతో మరణించాడని ఒక అధికారి శనివారం తెలిపారు. బుధవారం బోరింగ్ కెనాల్ రోడ్డులోని 'ఎన్‌హాన్స్' అనే ప్రైవేట్ క్లినిక్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుని మరుసటి రోజు మందులు రియాక్షన్ కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన అనంతరం ప్రైవేట్ క్లినిక్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పరారయ్యారు. నలంద జిల్లాలోని రాజ్‌గిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమల్ బిఘా గ్రామానికి చెందిన మనోరంజన్ పాశ్వాన్, గయాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం పాట్నాలో ఉన్నారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న పాశ్వాన్ ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే చర్మం దురదగా ఉందని ఫిర్యాదు చేయడం ప్రారంభించాడు. అతని స్నేహితుడు కమల్ కుమార్ మరుసటి రోజు అతన్ని క్లినిక్‌కి తీసుకెళ్లాడు, అయితే పాశ్వాన్ ఆరోగ్యం మరింత క్షీణించింది, క్లినిక్ సిబ్బంది అతనిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాశ్వాన్‌ను ఐసియులో ఉంచారు. అక్కడ ప్లాస్టిక్ సర్జన్, కార్డియాక్ సర్జన్, ఇంటర్నల్ మెడిసిన్, ఐసియు నిపుణులు అతనికి చికిత్స అందించారు. అయితే గంట తర్వాత పాశ్వాన్ చనిపోయాడు. అత్యంత విషమంగా ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. "హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ట్రీట్‌మెంట్ వల్ల తలెత్తిన సమస్యల కారణంగా అతను మరణించాడు. ఇది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సమయంలో ఔషధాల ప్రతిచర్యకు దారితీసే సరికాని చికిత్స కారణంగా కావచ్చు," అని డాక్టర్ చెప్పారు. గుండెపోటుతో మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.