గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) అధికారినని, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (GIFT సిటీ) అధ్యక్షుడిగా నటిస్తూ ప్రజలను మోసగించినందుకు వడోదర పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మోడల్‌పై అత్యాచారం చేశాడన్న అభియోగంపై అతడిని అరెస్టు చేశారు. ఒకరితో జరిగిన గొడవ కారణంగా అతడిని వడోదరలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా.. నిందితుడి నిజస్వరూపం వెలుగులోకి వచ్చింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు విరాజ్ పటేల్‌ను శనివారం అరెస్టు చేశారు. అతను గాంధీనగర్ నివాసి అని తేలింది. తదుపరి విచారణను సిటీ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మల్టీప్లెక్స్‌లో ఒకరితో జరిగిన గొడవ కారణంగా శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఓ మహిళతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లానని.. తాను సీఎంఓ అధికారినని తొలుత అధికారులకు చెప్పాడు. పోలీసులు అతని గుర్తింపును చెక్ చేశారు. అతను తన పాన్ కార్డ్‌లో వేరే ఇంటిపేరును ఉపయోగించినట్లు తేలింది. అతని ఆధార్ కార్డ్‌లో అతడు చెప్పిన వివరాలు మ్యాచ్ కాకపోవడంతో పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేషన్ లో అతడు చెప్పినవన్నీ అబద్ధాలేనని తేలింది.
అతని నిజస్వరూపం వెలుగులోకి వచ్చిన తర్వాత, అతనితో పాటు వచ్చిన యువతిని కూడా అతడు మోసం చేశాడని తెలిసింది. తనకు గిఫ్ట్ సిటీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని, పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడని ఆమె పోలీసులతో వాపోయింది. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి లోని పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.