తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ సమీపంలోని బారాపుల్లా ఎక్స్‌టెన్షన్ ఫ్లైఓవర్ పై నుండి ఓ వ్యక్తి కారుతో సహా కిందకు పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఫ్లై ఓవర్ ను ఇంకా పూర్తీ చేయకముందే కారులో బయలుదేరాడు. ఏకంగా 30 అడుగుల పై నుండి పడడంతో నలభై రెండేళ్ల జగ్‌దీప్ మరణించాడు. ఆ వ్యక్తి మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ వాహనంలో ఫ్లై ఓవర్ మీదకు ఎక్కాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో జగ్‌దీప్ నోయిడాలోని సెక్టార్ 26లోని తన కార్యాలయం నుంచి కృష్ణానగర్‌కు కారులో వెళ్తున్నాడు. పని ముగించుకుని ఇంటికి బయలుదేరిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌పైకి పొరపాటున కారును ఎక్కించాక ఈ ప్రమాదం జరిగిందని, 30 అడుగుల ఎత్తు నుంచి కారు కిందపడిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బాధితుడు కారును నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. సింగ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు. అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్‌ను జగన్‌దీప్ ఎందుకు ఎంచుకున్నారనే విషయం తెలుసుకోవడం కోసం దర్యాప్తు అధికారులు ఇంకా ప్రయత్నిస్తున్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు), అమృత గుగులోత్ తెలిపారు.