ఆస్తి కోసం శవం వేలి ముద్రలు వేయించుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో చోటు చేసుకుంది. ఓ మహిళ మృతి చెందడంతో.. ఆమె ఆస్తిని కొట్టేయాలని మృతదేహంతో బాండు పేపర్లపై వేలిముద్రలు వేయించుకున్నారు. మృతురాలికి ఎలాంటి సంతానం లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జయమ్మ అనే 63 ఏళ్ల మహిళ మైసూరు నగరంలోని శ్రీరాంపుర ఎక్స్‌టెన్షన్‌లో నివాసం ఉండేది. ఆమె ఇటీవల వృద్దాప్యం రావడంతో కన్నుమూశారు. జయమ్మకు పెళ్లైన కొంత కాలానికే భర్తతో వేరుపడింది.
అప్పటి నుండి ఆమె ఒంటరిగా ఉండేది. ఈ క్రమంలోనే ఆమెకు తన కుటుంబం వైపు నుండి కోట్ల రూపాయలు విలువ చేసే 14 ఎకరాల భూమి వచ్చింది. జయమ్మకు ఇద్దరు సోదరులు, ఒక తమ్ముడు ఉన్నారు. ఆమె బతికున్న సమయంలో రక్త సంబంధికులు, బంధువులు కన్నెత్తి కూడా చూడలేదు. ఇటీవల జయమ్మ చనిపోయిన విషయం తెలుసుకున్న తోబుట్టువులు, బంధువులు ఆమె మృతదేహం వద్దకు వచ్చారు. ఇక ఆమె అక్క కొడుకు అయితే ఏకంగా ఓ బాండు పేపర్‌పై మృతదేహంతో వేలి ముద్రలు వేయించుకున్నాడు. ఈ క్రమంలోనే అంత్యక్రియలకు హాజరైన బంధువుల్లో ఒకరు వేలి ముద్రలు వేయించుకునే సమయంలో వీడియో తీసి వైరల్ చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.