ఒకప్పటి సినిమాల్లోని సన్నివేశాలను తలపించేలా.. ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరాదిలో 8వ తరగతి విద్యార్థి.. 6వ తరగతి చదువుతున్న బాలిక ఇంట్లోకి చొరబడి ఆమె గొంతుపై కత్తి పెట్టి.. ఆమె నుదుటిపై కుంకుమను పెట్టి.. పెళ్లి అయిపోయిందని అన్నాడు. ఇలాంటి సినిమాలు భారత చలన చిత్ర చరిత్రలో చాలానే వచ్చాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్‌లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు 16 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహారాజ్‌గంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవి కుమార్ రాయ్ మాట్లాడుతూ 'అబ్బాయి తన స్నేహితుడితో కలిసి అమ్మాయి ఇంటికి చేరుకున్నాడు. అబ్బాయిలు అమ్మాయి ఇంటి సరిహద్దు గోడను ఎక్కి ఇంటికి చేరుకొని.. వారిలో ఒకరు బాలిక గొంతుపై కత్తి పెట్టి ఆమె నుదుటిపై సింధూరాన్ని పెట్టాడు' అని చెప్పారు. బాలిక సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించింది.. వేరే వాళ్లు అక్కడికి చేరుకునేలోపు, అబ్బాయిలు తప్పించుకోగలిగారు. డ్రైవర్ అయిన అమ్మాయి తండ్రి పని ముగించుకుని ఇంటికి వచ్చినప్పుడు, ఆమె తనకు ఎదురైన ఇబ్బందులను అతనికి వివరించిందని SHO చెప్పారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి మోటార్‌సైకిల్‌పై బాలిక ఇంటికి చేరుకున్న అబ్బాయిలను గుర్తించారు. ఒక పోలీసు బృందం బాలుడిని గుర్తించి అతనిని అదుపులోకి తీసుకుంది. బాలుడిని శిశు సంక్షేమ కమిటీ ముందు హాజరుపరిచారు. జువైనల్ హోమ్‌లో ఉంచారు.
విచారణలో ఆ బాలుడు తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని.. తాను అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడని పోలీసులు తెలిపారు. గత మూడు నెలలుగా నిందితుడు బాలికను నిత్యం వేధిస్తున్నాడు. వేధింపుల గురించి బాలిక తల్లిదండ్రులు తెలుసుకుని.. తమ కుమార్తెను మరొక పాఠశాలలో చేర్పించారు.