Hyderabad : ఆన్‌లైన్‌లో వోడ్కా బాటిల్ కొనాలనుకుని మోస‌పోయాడు..!

వోడ్కా బాటిల్ ను ఆన్‌లైన్‌లో కొనాలనుకుని.. తన క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి చెల్లింపు చేయడానికి ప్రయత్నించిన హైదరాబాద్ కు చెందిన వ్యక్తి దారుణంగా మోసపోయాడు

By Medi Samrat  Published on  22 Aug 2024 8:30 PM IST
Hyderabad : ఆన్‌లైన్‌లో వోడ్కా బాటిల్ కొనాలనుకుని మోస‌పోయాడు..!

వోడ్కా బాటిల్ ను ఆన్‌లైన్‌లో కొనాలనుకుని.. తన క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి చెల్లింపు చేయడానికి ప్రయత్నించిన హైదరాబాద్ కు చెందిన వ్యక్తి దారుణంగా మోసపోయాడు. వృత్తి రీత్యా వైద్యుడు అయిన ఆ వ్యక్తి 2.50 లక్షలకు పైగా డబ్బును పోగొట్టుకున్నాడు. నిజాంపేటకు చెందిన 25 ఏళ్ల వ్యక్తి ఆన్‌లైన్‌లో వోడ్కా కొనుగోలు కోసం వెబ్‌లో బ్రౌజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

అతను జూబ్లీహిల్స్‌లో పనిచేస్తున్న ప్రముఖ రిటైల్ లిక్కర్ మార్ట్‌కు సంబంధించిన అసలైన వెబ్‌సైట్‌ను కనుగొన్నాడు. వెబ్‌సైట్‌లో అందించిన నంబర్‌ను సంప్రదించి వోడ్కా బాటిల్ కోసం ఆర్డర్ చేశాడు. తన క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి 1,438 చెల్లించాడు. తరువాత మద్యం దుకాణం ఎగ్జిక్యూటివ్‌గా నటించిన ఓ వ్యక్తితో తన క్రెడిట్ కార్డ్ నంబర్, CVV, OTPని కూడా పంచుకున్నాడు, ఆ తర్వాత మోసగాడు వైద్యుడితో టచ్ లోకి వచ్చాడు. వెంటనే, అతని క్రెడిట్ కార్డ్ ఖాతా నుండి 61,115 కట్ అయింది. ఎలా జరిగింది ఇది అని నకిలీ ఎగ్జిక్యూటివ్‌ను ప్రశ్నించాడు వైద్యుడు. ఇదేదో పొరపాటు జరిగింది సార్.. కట్ అయిన మొత్తాన్ని తిరిగి పంపిస్తాము.. మేము చెప్పిన మరొక ఖాతాకు డబ్బు పంపమని అడిగాడు. బదిలీ చేసే డబ్బును కూడా తిరిగి ఇస్తామని హామీ ఇచ్చాడు. అతడిని నమ్మి వైద్యుడు పలు లావాదేవీల్లో 2,55,541 డబ్బును బదిలీ చేశాడు. ఆ తర్వాత సదరు వ్యక్తి కాంటాక్ట్ అవ్వకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story