నదిలో పడ్డ ప్యాసింజర్ బస్సు.. ముగ్గురు మృతి
Bus fell into river on Khandwa-Baroda highway.ప్రయాణీకులతో వెలుతున్న బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది.
By తోట వంశీ కుమార్ Published on 2 Jan 2022 12:39 PM ISTప్రయాణీకులతో వెలుతున్న బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో 28 మంది గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్‌పూర్‌లో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అలీరాజ్‌పూర్‌లోని ఖాండ్వా-బరోడా రహదారిపై ఆదివారం ఉదయం వేగంగా వెళ్తున్న ప్యాసింజర్ బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురు మృతదేహాలను వెలికితీయగా.. గాయపడిన 28 మందిని అలీరాజ్‌పూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 7గురు చిన్నారులు కూడా ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బస్సు గుజరాత్‌లోని భుజ్ నుంచి బర్వానీకి వెళ్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. బస్సు కల్వర్టు రెయింలింగ్ నుంచి 15 అడుగుల దిగువన ఉన్న నదిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రమాదం జరిగిన తరువాత బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అతడి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. ఇక బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ వంటి వివరాలను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు.