బస్సు, లారీ ఒకదానికొకటి ఢీ కొన్న ఘటనలో 9 మంది మృతి చెందగా.. 27 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబంకిలో చోటుచేసుకుంది. ప్రయాణీకులతో ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌కు బస్సు వెలుతుండగా.. బారాబంకి దేవ పోలీస్ స్టేషన్ సమీపంలో కిసాన్ పథ్ బాబూరి గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో మరొకొంత మంది పరిస్థతి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా.. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.