కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలి పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లో దాదాపు 14 కోట్ల రూపాయల విలువ గల అనుమానాస్పద కరెన్సీ నోట్లను, కరెన్సీ లెక్కింపు యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవాకు చెందిన వ్యక్తి ఆ ఇంట్లో ఉండేవాడు. అయితే చాలా కాలంగా రాకపోవడంతో ఆందోళన చెందిన ఇంటి యజమాని చూడడానికి వెళ్ళాడు. అయితే వెనుక తలుపు తెరిచి ఉండటం గమనించిన తర్వాత అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
తనిఖీలో పోలీసులు 500 రూపాయల డినామినేషన్ నోట్ల కట్టలను కనుగొన్నారు. అవి దాదాపుగా నిజమైన కరెన్సీకి దగ్గరి పోలికగా ఉన్నాయి. "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా" కు బదులుగా "రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా" అని తప్పుగా ఉంది. వాటిలో RBI గవర్నర్ సంతకం కూడా లేదు, పూర్తిగా సున్నాలతో తయారు చేసిన సీరియల్ నంబర్లు ఉన్నాయి. "సినిమా షూటింగ్ పర్పస్ ఓన్లీ", "స్పెసిమెన్" అని కూడా అందులో ఉంది. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఈ నోట్లు చట్టబద్ధమైన విలువ కాదని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఎందుకు అక్కడ ఉన్నాయా తెలుసుకోడానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అద్దెకు ఉన్న వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియలేదు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.