అనంతపురం జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‌తో అన్నదమ్ముల మృతి
Brothers died with Electric shock in Ananthapuram District.అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో
By తోట వంశీ కుమార్ Published on 10 April 2022 7:20 AM GMT
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి చెందారు. వివరాల్లో వెళితే.. డి.హారుహాల్ మండలం చెర్లోపల్లి గ్రామంలో రామచంద్ర(45), గంగన్న(43) అనే అన్నదమ్ములు నివసిస్తున్నారు. వ్యవసాయం చేస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. శనివారం అర్థరాత్రి సమయంలో ఇంటి ముందున్న పాకలో ఎద్దులు అరుస్తున్నాయి.
ఈ సమయంలో ఎద్దులు ఎందుకు అరుస్తున్నాయి అని రామచంద్ర ఎద్దుల పాక వద్దకు వెళ్లాడు. అయితే.. అప్పటికే పాకకు విద్యుత్ తీగలు తగిలి రేకులకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ విషయాన్ని గుర్తించని రామచంద్ర లోనికి వెళ్లగా కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. బయటకు వెళ్లిన అన్నయ్య ఎంత సేపటికి లోనికి రాకపోవడంతో గంగన్న కూడా పాక వద్దకు వెళ్లాడు. ఆయన కూడా విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు.
విషయం తెలుసుకున్న స్థానికులు కరెంటు సరఫరా ను నిలిపివేసి ఆ మూగ జీవాలను పాక నుంచి బయటకు తీసుకువచ్చారు. ఇద్దరు కుటుంబ సభ్యులు ఒకే సారి మృతి చెందడడంతో ఆ కుటుంబంలోని వారి రోదనలు మిన్నంటాయి. కరెంట్ షాక్‌తో ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.