కడప జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించడంతో 10 మంది మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కలసపాడు మండలంలోని మామిళ్లపల్లె గ్రామ శివారులోని ముగ్గురాళ్ల గనిలో ముగ్గురాయిని తీసేందుకు బద్వేలు నుంచి ముగ్గురాళ్ల గనికి జిలెటిన్ స్టిక్స్ వాహనంలో తీసుకొచ్చారు. ముగ్గురాయిని వెలికి తీసేందుకు జిలెటిన్ స్టిక్స్ అమర్చి పేలుడు జరపాలని భావించారు. జిలెటిన్ స్టిక్స్ అమరుస్తున్న క్రమంలో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో 10 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి శరీర భాగాలు తునాతునకలయ్యాయి. చుట్టు పక్కల ఎగిరిపడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.