ఆస్ప‌త్రి అల్మారాలో కూతురు, బెడ్ కింద త‌ల్లి మృత‌దేహలు ల‌భ్యం

Bodies Of Woman-Daughter Found In Hospital.ఓ ఆసుపత్రి ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లోని అల్మారా నుంచి దుర్వాస‌న వ‌స్తుండ‌డంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Dec 2022 3:19 AM GMT
ఆస్ప‌త్రి అల్మారాలో కూతురు, బెడ్ కింద త‌ల్లి మృత‌దేహలు ల‌భ్యం

ఓ ఆసుపత్రి ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లోని అల్మారా నుంచి దుర్వాస‌న వ‌స్తుండ‌డంతో ఆస్ప‌త్రి సిబ్బంది తెరిచి చూడ‌గా అందులో మ‌హిళ మృత‌దేహం క‌నిపించింది. వెంట‌నే వారు పోలీసులకు స‌మాచారం అందించారు. పోలీసులు సీసీ కెమెరాలు ప‌రిశీలించ‌గా ఆమెతో పాటు ఇంకో మ‌హిళ వ‌చ్చిన‌ట్లు క‌నుగొన్నారు. ఇంకొ మ‌హిళ కోసం గాలించ‌గా ఆ మ‌హిళ మ‌రొక గదిలో మంచం కింద శ‌వ‌మై క‌నిపించింది. వారిద్ద‌రూ త‌ల్లీ, కూతురుగా పోలీసులు నిర్థారించారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని భులాభాయ్ పార్క్ సమీపంలోని చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. అహ్మదాబాద్‌లోని కాగ్డాపిత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూలాభాయ్ పార్క్ సమీపంలో ఉన్న ఆసుపత్రి లోపల చాలా దుర్వాసన వ‌స్తుండ‌డంతో ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లోని అల్మారా తెరిచి చూశారు. అక్క‌డ ఓ మ‌హిళ మృత‌దేహం క‌నిపించింది. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వారు అక్క‌డి వెళ్లి ద‌ర్యాప్తు ప్రారంభించారు. మృతురాలిని భార‌తిగా గుర్తించారు.

ఓ బృందం ఆసుపత్రిలోని సీసీటివి ఫుటేజీని స్కాన్ చేయడం ప్రారంభించింది. ఈ సమయంలో వారు ఆసుపత్రికి భారతితో పాటు మరొక మహిళ వ‌చ్చిన‌ట్లు గ‌మ‌నించారు. దీంతో మరొక మ‌హిళ కోసం ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో వెత‌క‌డం ప్రారంభించారు. చివ‌రకు ఆస్ప‌త్రి రెండ‌వ అంత‌స్తులోని ఓ గ‌ది మంచం కింద భార‌తి త‌ల్లి చంపా మృత‌దేహాన్ని గుర్తించారు. ఈ ఇద్ద‌రు మహిళలు ఆస్పత్రికి వచ్చిన తర్వాత గంట పాటు సీసీటీవీ కెమెరాలు ప‌నిచేయ‌క‌పోవ‌డాన్ని పోలీసులు గుర్తించారు.

తల్లి శరీరంపై గొంతు నులిమి చంపిన గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని నమూనాలను సేకరించింది. ఇద్దరు మహిళలకు ఏదో ఇంజెక్షన్ ఇచ్చారని ఎఫ్‌ఎస్‌ఎల్ చెప్పినప్పటికీ, అధిక మోతాదులో అనస్థీషియా ఇచ్చి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. పోస్ట్‌మార్టం నివేదికలు వచ్చిన తర్వాత మాత్రమే వారి మరణానికి గల అస‌లు కార‌ణం తెలియ‌నుంది.

కాగా.. దంత చికిత్స కోసం వారిద్దరూ ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లారని భారతి సోదరుడు తెలిపారు. అయితే.. ఇద్దరు మహిళల మృతదేహాలు కనుగొనబడిన ఆసుపత్రిలో వారికి ఎటువంటి ఆపరేషన్ లేదా అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయలేదని పోలీసులు తెలిపారు.

Next Story