చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్స్ కావు.. బండ్లు మెల్లగా పోతయ్.. రోడ్లు ఎంత మంచిగుంటే అంత పెద్ద ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
2016లో బీజాపూర్ జాతీయ రహదారి ప్రకటించారన్న ఆయన.. రియల్ ఎస్టేట్ కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయలేదని.. కేవలం బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. బస్సు ప్రమాదానికి కారణం వందకు వందశాతం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
ఇదిలావుంటే.. చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. డిసెంబర్ 15 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది. జాతీయరహదారుల ప్రాంతీయ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీలను నివేదిక పంపాలని ఆదేశించింది.