దారుణం.. టీచర్ దెబ్బలు తాళలేక.. ఏడేళ్ల బాలుడు మృతి
By అంజి Published on 24 March 2023 3:37 PM ISTదారుణం.. టీచర్ దెబ్బలు తాళలేక.. ఏడేళ్ల బాలుడు మృతి
బీహార్‌లోని సహర్సా జిల్లాలో టీచర్ దెబ్బలు తాళలేక ఏడేళ్ల బాలుడు శుక్రవారం మరణించాడు. బాధితుడు ఆదిత్య కుమార్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. గత 10 రోజుల నుంచి హాస్టల్‌లో ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు పక్కనే ఉన్న మాధేపురా జిల్లా వాసులు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిత్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో పాఠశాల యాజమాన్యం అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రులు వచ్చేసరికి బాలుడు మృతి చెందాడు.
''మేము మా బిడ్డను మార్చి 14న సహర్సా జిల్లాలోని స్కూల్ కమ్ హాస్టల్‌కు పంపాము. ఆదిత్య అపస్మారక స్థితికి చేరుకున్నాడని, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చబడ్డాడని మాకు శుక్రవారం ఫోన్ కాల్ వచ్చింది. మేము ఆసుపత్రికి చేరుకునే సరికి అప్పటికే చనిపోయాడు'' అని ఆదిత్య తండ్రి ప్రకాష్ యాదవ్ తెలిపారు. మరణానికి అసలు కారణాన్ని తెలుసుకోవడానికి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపామని పోలీసులు తెలిపారు. భౌతిక దాడి వల్లే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
''స్కూల్ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. స్కూల్ యజమాని పరారీలో ఉన్నాడు. మేము ఎఫ్‌ఐఆర్ నమోదు చేసాము. అతనిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి" అని సదర్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ బ్రజేష్ చౌహాన్ చెప్పారు.