మెదక్‌లో వ్యక్తి సజీవదహనం కేసులో బిగ్‌ట్విస్ట్
Big twist in Medak car fire accident case.జనవరి 9న మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురంలో
By తోట వంశీ కుమార్ Published on 17 Jan 2023 7:49 AM GMTజనవరి 9న మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురంలో వ్యక్తి సజీవ దహనం అయిన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ సెక్రటేరియట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ధర్మా నాయక్ చనిపోయాడని అందరూ బావించారు. అయితే.. అతడు బ్రతికే ఉన్నాడు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ధర్మానే ఈ నాటకం ఆడినట్లు బయటపడింది.
బెట్టింగ్‌లతో ధర్మా భారీగా నష్టపోవడంతో పాటు పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. తాను చనిపోయినట్లు నమ్మిస్తే బీమా డబ్బులు వస్తాయని, వాటితో అప్పులు తీర్చొచ్చని అతడు బావించాడు. అందుకు ఓ పథకాన్ని సిద్ధం చేసుకున్నాడు. డ్రైవర్‌ను చంపి కారుకి నిప్పంటించాడు. కారు దగ్థం కావడంతో మృతదేహాం కాలిపోయింది. చనిపోయింది ధర్మానే అని అనుకునేందుకు ఐటెంటీ కార్డులు ఘటనాస్థలంలో పారేసి అక్కడి నుంచి పారిపోయాడు.
అయితే.. ఘటనాస్థలానికి కొద్ది దూరంలో పెట్రోల్ డబ్బా దొరకడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. ధర్మా సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడు బతికే ఉన్నాడని బావించి ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. అతడు గోవాలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. విచారణలో ఎందుకు చేశాననే విషయాన్ని అతడు వెల్లడించాడు.
కాగా.. కారులో సజీవదహనమైంది ఎవరు..? బతికి ఉండగానే సజీవ దహనం చేశారా..? అన్న వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ రోజు ధర్మాను కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.