హర్యానా రాష్ట్రంలోని భోండ్సీ జైలులో ఖైదీ ఒక తోటి ఖైదీపై చెంచాతో దాడి చేసి గాయపరిచాడని పోలీసులు శనివారం తెలిపారు. రేవారి జిల్లాలోని జతుసానా గ్రామానికి చెందిన అండర్ ట్రయల్ ఖైదీ మంగత్ రామ్ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం జైలులో ఈ దాడి జరిగింది. “శుక్రవారం ఉదయం 7:30 గంటల సమయంలో-రేవారి నివాసి మోను అలియాస్ బుద్దా ఆరు అంగుళాల పొడవు గల చెంచాతో నాపై దాడి చేశాడు. అతను నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు’’ అని మంగత్ రామ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అతని ఫిర్యాదు ఆధారంగా, మోనుపై శనివారం భోండ్సీ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్లు 323 (బాధ కలిగించడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. "దర్యాప్తు జరుగుతోంది. నిందిత ఖైదీని త్వరలో విచారణ కోసం ప్రొడక్షన్ వారెంట్‌పై తీసుకువెళతారు" అని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లూ తాజ్‌పురియాను ప్రత్యర్థి ముఠా సభ్యులు హతమార్చిన నేపథ్యంలో హర్యానాలోని అన్ని జైళ్లూ అప్రమత్తమయ్యాయి. ఖైదీలకు భోజన సమయంలో చెంచాలు ఇవ్వకూడదని జైలు యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.