నకిలీ 'నందిని' నెయ్యి రాకెట్ నడిపేది వీరే..!

కర్ణాటకలోని బెంగళూరులో కల్తీ 'నందిని' నెయ్యి రాకెట్‌ను నడుపుతున్న జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరినీ శివకుమార్, రమ్యగా గుర్తించారు.

By -  Medi Samrat
Published on : 26 Nov 2025 3:34 PM IST

నకిలీ నందిని నెయ్యి రాకెట్ నడిపేది వీరే..!

కర్ణాటకలోని బెంగళూరులో కల్తీ 'నందిని' నెయ్యి రాకెట్‌ను నడుపుతున్న జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరినీ శివకుమార్, రమ్యగా గుర్తించారు. దంపతులతో పాటు భారీగా నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఫెడరేషన్ (KMF) క్రింద ఉత్పత్తి చేయబడుతున్న‌ నందిని ప్రొడ‌క్ట్స్ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద, విశ్వసనీయమైన పాల బ్రాండ్‌లలో ఒకటిగా పేరుంది. అయితే ఆ పేరును ఆసరాగా తీసుకుని ఓ జంట నకిలీ నెయ్యి రాకెట్‌ను నడుపుతోంది.

సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) బృందం ఈ దాడిలో పెద్ద సంఖ్యలో యంత్రాలు, నెయ్యి తయారీకి సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఈ జంట అధునాతన పారిశ్రామిక పరికరాలను ఉపయోగించి కల్తీ నెయ్యిని తయారు చేసి 'నందిని' బ్రాండ్ పేరుతో విక్రయిస్తుంది. అన్ని యంత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ రాకెట్‌లో పాల్గొన్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ డెయిరీ బ్రాండ్లలో ఒకటైన 'నందిని' పేరుతో నడుస్తున్న ఈ రాకెట్ కొంతకాలం క్రితం వెలుగులోకి వచ్చింది. 'నందిని' పేరుతో కల్తీ నెయ్యిని మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు అంతర్గత విచారణలో తేలింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా నవంబర్ 14న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, కేఎంఎఫ్ విజిలెన్స్ వింగ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి.

నకిలీ నెయ్యి నింపిన వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు ఆ తర్వాత నెయ్యి తయారీకి సరఫరా కేంద్రమైన కృష్ణా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన పలు గోదాములు, దుకాణాలు, వాహనాలపై దాడులు చేశారు. ఈ క్రమంలో తమిళనాడు నుంచి వస్తున్న కల్తీ నెయ్యితో కూడిన వాహనం కూడా పోలీసులకు దొరికింది.

వీరి వ‌ద్ద నుంచి రూ.1.26 కోట్ల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 8,136 లీటర్ల కల్తీ నెయ్యి కూడా లభ్యమైందని, దీని విలువ రూ.56.95 లక్షలు ఉంటుందని అంచనా. ఈ దాడిలో రూ.1.19 లక్షల నగదు, 5 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రూ.60 లక్షల విలువైన వస్తువులను కూడా పోలీసులు గుర్తించారు.

నెయ్యిలో కొబ్బరినూనె, పామాయిల్ కలిపినట్లు ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, నెయ్యిలో జంతువుల కొవ్వు కూడా కలిపారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story