బెంగళూరులో ఊహించని ఘోరం
Bengaluru couple dies inside bathroom, police suspect geyser gas leak. సహజీవనం చేస్తున్న ఓ జంట ఊహించని రీతిలో ప్రాణాలను కోల్పోయింది.
By M.S.R Published on 13 Jun 2023 8:11 PM IST
సహజీవనం చేస్తున్న ఓ జంట ఊహించని రీతిలో ప్రాణాలను కోల్పోయింది. ఆ జంట ప్రాణాలు కోల్పోయి బాత్రూంలో నగ్నంగా కనిపించారు. ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్(30), బెళగావి జిల్లాకు చెందిన సుధారాణి(22) బెంగళూరు లోని ఓ హోటల్లో పనిచేస్తున్నారు. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు త్వరలోనే పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. శనివారం రాత్రి చంద్రశేఖర్, సుధారాణి జంటగా స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లారు. వేడినీళ్ల కోసం గీజర్ ఉపయోగించగా అందులోంచి విషయవాయువులు వెలువడ్డాయి. బాత్రూం కిటికీలు కూడా మూసి వుండటంతో గీజర్ నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ బాత్రూంలో నిండిపోయింది. దీంతో ఈ వాయువులు పీల్చి యువజంట ఒక్కసారిగా స్ఫృహ కోల్పోయారు.
ఆదివారం చంద్రశేఖర్, సుధారాణి విధులకు హాజరుకాకపోవడం, ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో తోటి సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో వారు నివాసముండే ఇంటికెళ్లి తలుపులు బాదినా ఎవరూ తీయలేదు. కంగారు పడిపోయిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా బాత్రూంలో ఆ జంట మృతదేహాలు కనిపించాయి. పోలీసులు మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గీజర్ ల నుండి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవలి కాలంలో చాలా జరుగుతూ ఉన్నాయి. గ్యాస్ గీజర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు.