హైదరాబాద్ లో పట్టుబడ్డ బంగ్లాదేశ్ మహిళ.. చేతిలో ఏమున్నాయంటే.?
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ (RGI) విమానాశ్రయంలో ఓ మహిళను అరెస్టు చేశారు
By Medi Samrat Published on 24 Oct 2024 3:00 PM GMTహైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ (RGI) విమానాశ్రయంలో ఓ మహిళను అరెస్టు చేశారు. భారతీయ పాస్‌పోర్ట్‌తో సహా పలు ఫేక్ సర్టిఫికెట్లు ఆమె దగ్గర గుర్తించారు. బంగ్లాదేశ్ కు చెందిన మహిళగా గుర్తించారు. సోనాలి బల్లవ్‌గా గుర్తించబడిన 29 ఏళ్ల మహిళ ఒమన్‌లోని మస్కట్ నుండి 6E-1274 విమానంలో వచ్చింది.
హైదరాబాద్ విమానాశ్రయంలోని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారికి అధికారిక తనిఖీల్లో సోనాలి గుర్తింపుపై అనుమానం రావడంతో పట్టుబడింది. తదుపరి విచారణలో ఆమె భారతీయ పౌరురాలు కాదని, బంగ్లాదేశ్‌లోని మానిక్‌గంజ్ సదర్‌కు చెందిన సోనాలి అనే బంగ్లాదేశ్ జాతీయురాలు అని తేలింది.
ఆమె 2015లోనే భారత్ లోకి వచ్చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని పెట్రాపోల్-బెనాపోల్ సరిహద్దు ద్వారా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్లు ఆ మహిళ అంగీకరించింది. ఢిల్లీలోని పాండవ్ నగర్‌లో భారతదేశానికి చెందిన లక్ష్మీ కాంత్ బల్లవ్‌ను వివాహం చేసుకుంది. పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, భారతీయ పాస్‌పోర్ట్‌తో సహా కీలకమైన గుర్తింపు పత్రాలు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఆమె పొందింది. మహిళ సాధారణంగా దిగాల్సిన ఢిల్లీకి బదులుగా హైదరాబాద్‌ను తన ఎంట్రీ పాయింట్‌గా ఎంచుకుంది. అక్కడ దిగితే అధికారులు గుర్తించేస్తారేమోనని భయపడి హైదరాబాద్ లో అడుగుపెట్టగా.. ఇక్కడ అడ్డంగా దొరికిపోయింది.