హిజ్రాగా మారుస్తామని లాడ్జిలో ఆపరేషన్.. మర్మాంగాన్ని తొలగించిన బీఫార్మసీ విద్యార్థులు.. తరువాత..?
B Pharmacy students cut off a man private parts in Nellore.ఓ వ్యక్తి లింగమార్పిడి చేయించుకోవాలని అనుకున్నాడు. ఇదే
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2022 7:53 AM ISTఓ వ్యక్తి లింగమార్పిడి చేయించుకోవాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని తనకు తెలిసిన బీఫార్మసీ విద్యార్థుల దగ్గర చెప్పాడు. అయితే.. అందుకు లక్షల్లో ఖర్చు అవుతుందని.. తాము మాత్రం తక్కువకే ఆపరేషన్ చేస్తామని అతడిని వారు నమ్మించారు. వారి మాటలను నమ్మిన ఆ వ్యక్తి అందుకు అంగీకరించాడు. ఓ లాడ్జికి తీసుకువెళ్లిన వారు అక్కడ అతడి మర్మాంగాన్ని తొలగించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా కామేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అలియాస్ అమూల్య(28) కు 2019లో మేనమామ కుమారైతో వివాహం జరిగింది. అయితే.. కొన్ని కారణాల వల్ల వారు వివాహామైన ఏడాదికే విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ ఇల్లు విడిచి బయటకు వచ్చేసి ఒంగోల్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడికి విశాఖపట్నంకు చెందిన ట్రాన్స్‌జెండర్ మోనాలిసా అలియాస్ అశోక్‌తో పరిచయం ఏర్పడింది.
ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. కొద్దిరోజుల క్రితం శ్రీకాంత్, మోనాలిసాలకు ఓ యాప్ ద్వారా నెల్లూరు జిల్లాకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థులైన మస్తాన్, జీవాతో పరిచయమైంది. ఈ క్రమంలో ఓ రోజు తాను లింగ మార్పిడి చేయించుకునేందుకు ముంబై వెలుతున్నానని శ్రీకాంత్..మస్తాన్‌కు చెప్పాడు. అయితే.. ముంబైకి వెళితే లక్షల్లో ఖర్చుఅవుతుందని.. తాను బీ ఫార్మసీ విద్యార్థినని తక్కువకే ఆపరేషన్ చేస్తామని మస్తాన్ చెప్పాడు. తక్కువ ఖర్చుతోనే ఆపరేషన్ అనడంతో శ్రీకాంత్ కూడా సరేనన్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 23న మస్తాన్, జీవా, మోనాలిసా, శ్రీకాంత్ లు నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్‌లోని ఓ లాడ్జిలో రూమ్‌ను అద్దెకు తీసుకున్నారు. మస్తాన్, జీవాలు మోనాలిసా సాయంతో శ్రీకాంత్ మర్మాంగాన్ని తొలగించారు. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. క్షణాల్లోనే పల్స్‌రేటు పడిపోవడంతో అతడు మృతి చెందాడు. దీంతో మిగిలిన వారు అక్కడి నుంచి పరారు అయ్యారు. లాడ్జి సిబ్బంది సమాచారం మేరకు ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడి సోదరికి సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యారు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.