అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ వరుసకు కోడలయ్యే మహిళను అతికిరాతంగా హత మార్చింది. అనంతరం ఆమె తలను మొండెం నుంచి వేరు చేసి, దాన్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. రాయచోటిలో గురువారం జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళపల్లెకు చెందిన వసుంధర(35)కు దేవపట్లకు చెందిన రాజాతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 9, 6వ తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలున్నారు. పదేళ్ల క్రితం వీరు రాయచోటిలోని కె.రామాపురానికి వచ్చి స్థిరపడ్డారు. ఏడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజా మరణించాడు. ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న వసుంధర తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటోంది. తనకు చిన్నత్త అయిన సుబ్బమ్మ(రాజా చిన్నమ్మ)ను చేరదీసి తనతో పాటే ఉంచుకుంది.
అయితే.. వసుంధర వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం సుబ్బమ్మ పెంచుకుంది. పైగా సుబ్బమ్మ పేరుపై ఉన్న ఇంటిని రాసి ఇవ్వాలని వసుంధర పట్టుబడుతూ ఉండేది. ఈ క్రమంలో సుబ్బమ్మ తన అన్న కుమారుడు చంద్రబాబుతో కలిసి వసుంధరను హతమార్చాలనే పథకం పన్నింది.
గురువారం వసుంధరను భోజనానికి పిలిచింది. ఆమె రాగానే కత్తితో దాడి చేసి గొంతు కోసింది. తల నరికి మొండాన్ని వేరు చేశారు. అనంతరం పట్టపగలే సుబ్బమ్మ తల పట్టుకుని వీధుల్లో నడుచుకుంటూ వెళ్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.