హైదరాబాద్‌లో దారుణం..ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారయత్నం, దాడి
హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో అర్ధరాత్రి చోటుచేసుకున్న అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది.
By - Knakam Karthik |
హైదరాబాద్‌లో దారుణం..ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారయత్నం, దాడి
హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో అర్ధరాత్రి చోటుచేసుకున్న అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించి, ఆమె ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేయడంతో యువతి తీవ్రంగా గాయపడింది. మణికొండకు చెందిన యువతి తన నివాసంలో ఒంటరిగా ఉన్న సమయంలో పర్వతాల రోహిత్ అనే యువకుడు అర్ధరాత్రి ఆమె గదిలోకి అక్రమంగా ప్రవేశించాడు. గత రెండు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ యువతిని వెంటాడుతూ వేధింపులకు పాల్పడుతున్న రోహిత్, తెల్లవారుజామున గది తలుపు తెరిచి ఉండ టాన్ని గమనించి నేరుగా బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.
అఘాయిత్యానికి యత్నిస్తున్న సమయంలో యువతి తీవ్రంగా ప్రతి ఘటించడంతో ఆగ్రహానికి గురైన రోహిత్ తన వద్ద ఉన్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి మెడపై, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావంతో బాధపడుతున్న యువతి అతని నుంచి తప్పించుకొని బయటకు పరుగులు తీసి స్థానికుల సహాయంతో ఆసుపత్రికి వెళ్ళింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అత్యాచార యత్నం, హత్యాయత్నం, గృహనిర్భందం, కత్తితో దాడి వంటి పలు సెక్షన్ల కింద నిందితుడిపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు పర్వతాల రోహిత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.