దైవదర్శనానికి వెలుతున్న కుటుంబంపై దుండగులు విచక్షణా రహితంగా దాడి చేశారు. సినిమాటిక్ స్టైల్‌లో రోడ్డుపై మేకులు వేయడంతో కారు పంక్చర్ అయి బోల్తా పడింది. వెంటనే దొంగలు కారులో ఉన్న వారిపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి బంగారం, నగదు దోచుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాసీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవెలక్కిచెర్ల హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాములు, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి రమేష్ కుటుంబంతో కలిసి షిర్డీ సాయిబాబా దర్శనానికి కారులో బయలుదేరారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో హుమ్నాబాద్ దగ్గరికి రాగానే రోడ్డుపై మేకులు కారు టైరుకు గుచ్చుకుని పంక్చర్ అయి బోల్తా పడింది. అదే అదునుగా దొంగలు చిన్నపిల్లలు, మహిళలు అని చూడకుండా కత్తులు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి నగలు, నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.