Vizag: సిగరెట్ కోసం గొడవ.. ఫ్రెండ్‌ని చంపేశారు
విశాఖపట్నంలో దారుణం జరిగింది. సిగరెట్ కోసం జరిగిన గొడవలో ఓ బాలుడిని తోటి స్నేహితులు గొంతు కోసి చంపారు.
By అంజి Published on 24 Sept 2023 7:38 AM ISTVizag: సిగరెట్ కోసం గొడవ.. ఫ్రెండ్‌ని చంపేశారు
విశాఖపట్నంలో దారుణం జరిగింది. సిగరెట్ కోసం జరిగిన గొడవలో ఓ బాలుడిని తోటి స్నేహితులు గొంతు కోసి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏవీఎన్ కాలేజీ సమీపంలో నూకాలమ్మ అనే మహిళ తన కొడుకు చిన్నా (17)తో కలిసి ఉంటోంది. కొద్ది కాలంగా చిన్నా చెడు వ్యసనాలకు బానిసగా మారాడు. పాతనగరంలోని విస్కీ అనే రౌడీషీటర్‌ని ఆదర్శంగా తీసుకుని చెడు సవాసాలు మొదలు పెట్టాడు. ఈ నెల 20వ తేదీన ఫ్రెండ్స్‌తో కలిసి వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్నాడు. 21 అర్ధరాత్రి దాటక చిన్నా, మరో నలుగురు బాలురు సిగరెట్లు తాగారు. ఈ క్రమంలోనే సిగరెట్ విషయమై వారి మధ్య ఘర్షణ జరిగింది.
మాటా మాటా పెరగడంతో స్నేహితులు కత్తితో చిన్నాను గొంతు కోసి చంపారు. ఆపై చిన్నా మృతదేహాన్ని గోనె సంచిలో దాచిపెట్టారు. వినాయకచవితి ఉత్సవ సామగ్రిని సముద్రంలో కలపాలని తెల్లవారుజామున ఆటో డ్రైవర్ రాముతో బేరం మాట్లాడుకున్నారు. గోనె సంచిలో ఉన్న మృతదేహాన్ని ఆటోలో చేపలరేవు దగ్గరకు తీసుకెళ్లి సముద్రంలో పడేసి వెళ్లిపోయారు. మృతదేహం లభ్యమైన తర్వాత పోలీసులు ఆటోడ్రైవర్‌ను గుర్తించి విచారించగా నలుగురు పిల్లల గురించి చెప్పాడు. వారిని శనివారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఆ నలుగురినీ జువైనల్ హోంకు తరలించారు.