ఒంగోలులో దారుణం.. యువకుడిని చితకబాది, ఆపై మూత్రం పోసి..

ఓ యువకుడితో కొందరు పూటుగా మద్యం తాగించి, ఆ తర్వాత అతడిని విచక్షణారహితంగా చావబాదారు. రక్తం కారుతున్న ఆ గాయాలతో అతను విలవిల్లాడుతున్నా కాస్తైనా కనికరం చూపలేదు.

By అంజి  Published on  19 July 2023 1:00 PM IST
Ongole, Crime news, APnews

ఒంగోలులో దారుణం.. యువకుడిని చితకబాది, ఆపై మూత్రం పోసి..

ఓ యువకుడితో కొందరు పూటుగా మద్యం తాగించి, ఆ తర్వాత అతడిని విచక్షణారహితంగా చావబాదారు. రక్తం కారుతున్న ఆ గాయాలతో అతను విలవిల్లాడుతున్నా కాస్తైనా కనికరం చూపలేదు. వారిలోని పైశాచికత్వం అంతటితో ఆగకపోగా.. యువకుడి నోట్లో మూత్రం పోసి, తాగాలంటూ చితకబాదారు. తనను వదిలేయండి అంటూ బాధితుడు కాళ్లావేళ్లా పడి వేడుకున్నా వినిపించుకోలేదు. బూతులు తిడుతూ దారుణంగా కొట్టారు. మూత్రం పోస్తున్న వ్యక్తి మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలంటూ కొట్టారు. ఈ అమానుషాన్ని మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సుమారు నెల క్రితం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

బాధితుడు మోటా నవీన్ గిరిజన యువకుడు, ప్రధాన నిందితుడు మన్నె రామాంజనేయులు.. చిన్నప్పటి నుంచి జులాయిగా తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నారు. వీరిద్దరిపై సుమారు 50కి పైగా దొంగతనాల కేసులున్నాయి. నవీన్ పలుమార్లు పోలీసులకు పట్టుబడి జైలుశిక్ష అనుభవించాడు. రామాంజేయులు కొన్నేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. అయితే కొన్ని రోజుల కిందట వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం రామాంజనేయులు.. నవీన్‌ని మద్యం సేవిద్దామంటూ ఒంగోలులోని కిమ్స్ ఆస్పత్రి వెనుక వైపునకు పిలిచాడు. నవీన్ అక్కడికి వెళ్లేసరికి అక్కడ రామాంజనేయులుపాటు ఒంగోలులోని ఇస్లాంపేట, గోపాలనగర్, బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన మొత్తం 9 మంది యువకులు ఉన్నారు. అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలోనే పాత వివాదాన్ని తిరగదోడుకున్నారు. ప్లాన్‌ ప్రకారం.. అక్కడున్న తొమ్మిది మంది కలసి నవీన్‌పై దాడి చేశారు.

బాధితుడు తనను వదిలిపెట్టాలని కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. రక్తం వచ్చేలా బాధితుడిని కొట్టారు. ఆపై అతడి నోట్లో మూత్రం పోస్తూ తాగాలని బలవంతం చేస్తూ మరోసారి దాడి చేశారు. మర్మాంగాన్ని అతని నోట్లోకి చొప్పించే ప్రయత్నం కూడా చేశారు. ఈ దారుణాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. తాజాగా ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వెలుగుచూశాయి. ఈ వ్యవహారంపై బాధితుడు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు దాడి, ఎస్సీ, ఎస్టీ కేసుగా నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. నిందితులు విచారణ, అరెస్టుకు సైతం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. నిందితుల్లో కొందరు ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టడంతో అది వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమై నిందితుల కోసం వెతుకులాట ప్రారంభించారు.

Next Story