నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం - హైదరాబాద్ నేషనల్ హైవే సమీపంలోని హాజీపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళా కూలీలకు మద్యం తాగించి.. వారు మైకంలోకి వెళ్లిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బల్మూర్ మండల పరిధిలోని గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలు అచ్చంపేటకు వచ్చి రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. మొన్న (గురువారం) కూడా వారు యథావిధిగా పని కోసం అచ్చంపేట వచ్చారు. ఈ క్రమంలోనే బండల దుకాణాలు నిర్వహించే ఇద్దరు వ్యక్తులు వినోద్ సింగ్, గజానంద సింగ్ తమ ఇంట్లో పని ఉందని కూలీ మాట్లాడుకొని మహిళలను తమ వెంట తీసుకెళ్లారు.
ఇంటిని శుభ్రం చేయడం పూర్తయ్యాక.. మహిళలను వినోద్, గజానంద మాటల్లో దింపారు. వారిని మభ్యపెట్టి మధ్యాహ్నం 3 గంటల సమయంలో కారులో ఎక్కించుకుని డిండి వైపు తీసుకెళ్లి మద్యం తాగించారు. హాజీపూర్ శివారు ప్రాంతంలో కారు నిలిపి మత్తులో ఉన్న మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అచ్చంపేట శివారులోని స్పోర్ట్స్ గ్రౌండ్ సమీపంలో మహిళలను వదిలేశారు. అపస్మారక స్థితిలో ఉన్న మహిళలను గమనించిన స్థానికులు డయల్ 100, 108లకు సమాచారం ఇచ్చారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రవీందర్ తెలిపారు.