మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ 29 ఏళ్ల వ్యక్తి తనకు దూరపు బంధువు అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసిన తల్లి కొడుకును మందలించింది. దీంతో తన తల్లిని మహిళా బంధువు సహాయంతో కొడుకు గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన భివాండి పట్టణంలో జరిగింది. ఆ వ్యక్తి మొదట దీనిని ప్రమాద కేసుగా మార్చడానికి ప్రయత్నించాడని నార్పోలీ పోలీస్ స్టేషన్ నుండి సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ మదన్ బల్లాల్ తెలిపారు.
ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు బుధవారం ఆ వ్యక్తిని, అతని బంధువైన 30 ఏళ్ల మహిళను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితురాలైన మహిళ మృతురాలి భర్తకు స్వయనా మేనకోడలు. ఆమె మృతుడి కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటోందని అధికారి తెలిపారు. మహిళా బంధువుతో సంబంధమున్న విషయమై తల్లి కుమారుడితో తరచూ గొడవ పడుతుండేది. ఈ క్రమంలోనే కొడుకు, కొడుకు ప్రియురాలు.. తల్లితో గొంతుకోసి హత్య చేసినట్లు అధికారి తెలిపారు.
మృతురాలి కుమారుడు మొదట్లో యాక్సిడెంట్‌గా భావించి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ ఇతర కుటుంబ సభ్యుల ఫిర్యాదు, సంఘటనపై విచారణ జరిపిన తరువాత, పోలీసులు వ్యక్తిని, అతని మహిళా బంధువును అరెస్టు చేసి, భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 302 (హత్య), 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.